Share News

Harish Rao: డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్

ABN , Publish Date - Jan 20 , 2026 | 09:55 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డైవర్షన్ కోసమే నోటీసులు పంపించారని ఆయన ఆరోపించారు.

Harish Rao: డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్
Former Minister Harish Rao

హైదరాబాద్, జనవరి 20: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) మాజీ మంత్రి హరీశ్ రావుకు(Harish Rao) సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు మాజీ మంత్రి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సిట్ నోటీసులపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెడితే.. సాయంత్రానికి తనకు నోటీసులిచ్చారని విమర్శలు గుప్పించారు. రాత్రి నోటీసులిచ్చి.. విచారణకు ఆదేశించారన్నారు.


సిట్ పేరిట డ్రామాలు..

సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. డైవర్షన్ కోసమే నోటీసులు పంపించారని ఆరోపించారు. రేవంత్ ముఠా అవినీతిని బయటపెడుతున్నందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ హరీశ్ ఫైర్ అయ్యారు. తాము తప్పు చేయలేదని.. అందుకే భయపడట్లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా.. సిట్‌ పేరిట డ్రామాలు ఆడుతున్నారని హరీశ్ వ్యాఖ్యానించారు.


ఎన్నికలుంటేనే రైతు భరోసా..

హరీశ్ రావు మాట్లాడుతూ.. జనవరి వచ్చినా యాసంగి రైతుబంధు ఇవ్వలేదన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి తీసుకెళ్తుంటే అడ్డుకున్నామని తెలిపారు. ఎన్నికలుంటేనే ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తోందంటూ దుయ్యబట్టారు. మంత్రుల స్కాంలు, వాటాల పంచాయితీలు నెమ్మదిగా బయటపడుతున్నాయన్నారు. బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరుతున్నామని హరీశ్ పేర్కొన్నారు.


పోలీసుల మోహరింపు..

కాగా.. ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్‌ విచారణకు మాజీ మంత్రి హాజరుకానున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో.. సిట్ హరీశ్ రావును ప్రశ్నించనుంది. 2024 మార్చి 10న నమోదైన ఫోన్ ట్యాపింగ్‌ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ విచారణ జరగనుంది. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. హరీశ్ రావు మినహా ఎవరినీ లోపలకు అనుమతించేది లేదని ఇప్పటికే పోలీసులు తేల్చిచెప్పారు.


న్యాయవాదులతో భేటీ..

సిట్ విచారణ నేపథ్యంలో న్యాయవాదులతో హరీశ్ రావు సమావేశమయ్యారు. విచారణలో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించారు. మరికాసేపట్లో మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు.. కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో కీలక భేటీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు


Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 10:52 AM