Harish Rao: రేవంత్ ద్రోహ బుద్ధి బట్టబయలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:40 AM
విచారణ అర్హతలేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నల్లమలసాగర్ విషయంలో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి పరోక్షంగా ఏపీకి మద్దతిస్తున్నారని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన మండిపడ్డారు.
విచారణ అర్హతలేని పిటిషన్‌వేసి
పోలవరం-నల్లమలసాగర్‌కు సహకారం
కాంగ్రెస్ సర్కార్ వల్ల తెలంగాణకు తీరని అన్యాయం
నీటి హక్కుల కోసం పోరాటం చేస్తాం
బలహీన రిట్ పిటిషన్‌తో ఏపీకి మద్దతు: హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): విచారణ అర్హతలేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు (HarishRao) పేర్కొన్నారు. నల్లమలసాగర్ విషయంలో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి పరోక్షంగా ఏపీకి మద్దతిస్తున్నారని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన మండిపడ్డారు. నాడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, చేతగాని కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హతలేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి ధారాదత్తం చేసి తెలంగాణకు ఆయన చేస్తున్న చారిత్రక ద్రోహం ఇదని ఆరోపించారు. రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమంటే.. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు కట్టుకొనేందుకు ఏపీకి గడువు ఇవ్వడవేనన్నారు.
ఏపీ, తెలంగాణలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏళ్లుగడిచినా ముగియని కథేనని, ఈలోపు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీళ్లను తరలించుకుపోతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్.. సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ ఎద్దేవా చేశారు. పోలవరం-నల్లమలసాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తోందన్నారు. పంచాయితీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు మనమే కూర్చొని చర్చించుకుందాం అన్న సీఎం మాటల అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్‌రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదన్నారు. తెలంగాణకు ద్రోహం చేస్తుంటే రాష్ట్రాన్ని సాధించిన బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, రాష్ట్ర నీటి హక్కులకోసం పోరాటం చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.
గోదావరి జలాలను తాకట్టు పెడుతున్నారు: జగదీశ్‌రెడ్డి
సంక్రాంతి సందర్భంగా గోదావరి నీళ్లను రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్‌గా అప్పగించారని, రాజకీయ ప్రయోజనాల కోసమే కృష్ణా, గోదావరి జలాలను తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం డైరెక్షన్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని, తెలంగాణ ప్రభుత్వం వేసిన బలహీనమైన పిటిషన్ చెల్లదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..
పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Read Latest Telangana News And Telugu News