Share News

మళ్లీ తెరపైకి ‘ఐబొమ్మ’.. ఫిలింఛాంబర్ ఫిర్యాదుతో కలకలం

ABN , Publish Date - May 17 , 2026 | 01:40 PM

తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కలవరపెడుతూ ‘ఐ బొమ్మ’ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మళ్లీ తెరపైకి ‘ఐబొమ్మ’.. ఫిలింఛాంబర్ ఫిర్యాదుతో కలకలం
Movie Piracy Case

హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కలవరపెడుతూ ‘ఐ బొమ్మ’ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఈరోజు (ఆదివారం) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ‘ఐ బొమ్మ’, ‘బప్పం టీవీ’ పేర్లతో నడుస్తున్న వెబ్‌సైట్లు తాజాగా విడుదలైన పలు సినిమాలను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అధికారికంగా ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించేలా పైరసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సినీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


నాకు ఎలాంటి సంబంధం లేదు: రవి

ఇదిలా ఉంటే, గతంలో ‘ఐ బొమ్మ’ పేరుతో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగిన ఇమంది రవి అనే వ్యక్తి స్పందించారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరును, ‘ఐ బొమ్మ’ బ్రాండ్‌ను దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు కొత్త వెబ్‌సైట్‌ను సృష్టించారని ఆరోపించారు.ఇటీవల విడుదలైన పలు తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో నిర్మాతలు, దర్శకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ వెబ్‌సైట్లలో కనిపించడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతోందని సినీ పరిశ్రమ చెబుతోంది.


పోలీసుల చర్యలు..

సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం ‘ఐ బొమ్మ’ , ‘బప్పం టీవీ’ వెబ్‌సైట్ల నిర్వాహకులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ సర్వర్లు ఎక్కడ నుంచి ఆపరేట్ అవుతున్నాయి?, వెబ్‌సైట్ల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. సినీ పరిశ్రమ ప్రతినిధులు పైరసీని అరికట్టేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ప్రేక్షకులు కూడా థియేటర్లలో లేదా అధికారిక ఓటీటీ వేదికల్లోనే సినిమాలు చూడాలని సినీ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 01:48 PM