Share News

పోక్సో కేసులో నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరు.. సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్

ABN , Publish Date - May 15 , 2026 | 09:33 PM

మ‌హిళ‌ల‌పైన నేరాల‌ను తమ ప్రభుత్వం నియంత్రించిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో 8వ తేదీ రాత్రి బాలిక త‌ల్లి పేట్ బ‌షీరాబాద్ స్టేష‌న్‌లో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు.

పోక్సో కేసులో నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరు.. సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మే15 (ఆంధ్రజ్యోతి): మ‌హిళ‌ల‌పైన నేరాల‌ను తమ ప్రభుత్వం నియంత్రించిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో 8వ తేదీ రాత్రి బాలిక త‌ల్లి పేట్ బ‌షీరాబాద్ స్టేష‌న్‌లో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. 9వ తేదీన విచార‌ణ ప్రారంభించి కేసు పెట్టామని చెప్పుకొచ్చారు. ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్ వేదికగా సీఎం మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మొత్తం 10 కార్య‌క్ర‌మాలకు హాజ‌ర‌య్యారని అన్నారు. ఆయ‌న భ‌ద్ర‌త కోసం 10 వేల మంది పోలీసులు పనిచేశారని చెప్పారు. 11వ తేదీన సెక్ష‌న్లు స‌వ‌రించి వెంట‌నే నోటీసులు జారీ చేశామని తెలిపారు. బండి భగీరథ్ క‌రీంన‌గ‌ర్‌లో ఫిర్యాదు చేశారని ప్రస్తావించారు. ఫిర్యాదుల‌ను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్‌మెంట్‌ను తీసుకొని నోటీసులు ఇచ్చారని తెలిపారు.


ఈ కేసులో ఐదు టీంలు ప‌నిచేస్తున్నాయి..

తొందరపడితే 1000 మంది పోలీసుల‌ను తీసుకుని ఇంటి మీద పడ్డారని అంతా విమ‌ర్శ‌లు చేసేవారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సినిమా వాళ్లు, రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా తనకు మిన‌హాయింపులు లేవని స్పష్టం చేశారు. బాలిక కేసులో ఎలాప‌డితే అలా చేయ‌డానికి వీల్లేదని తేల్చిచెప్పారు. బండి సంజయ్‌కి తాను స‌హాయం చేస్తే పోక్సో కేసు పెట్టం కదా..?‌ అని ప్రశ్నించారు. పోక్సో కేసు పెట్టామంటేనే తన కమిట్‌మెంట్ ఏమిటో తెలుస్తుంది క‌దా..? అని నిలదీశారు. హోంమంత్రిగానే కాకుండా ముఖ్య‌మంత్రిగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం తన బాధ్య‌త‌ అని స్పష్టం చేశారు. ఈ కేసులో ఐదు టీంలు ప‌నిచేస్తున్నాయని వివరించారు. బండి సంజ‌య్ ఇంటికి పోలీసులు నోటీసులు ఇవ్వ‌డానికి వెళ్లారని.. మాజీ మంత్రి కేటీఆర్ బావ‌మ‌రిది ఇంటికి వెళ్లారని తెలిపారు. బండి సంజ‌య్‌కి, బీఆర్ఎస్‌లకి మ‌ధ్య ఎక్క‌డ చెడిందో తనకు తెలియ‌దని విమర్శించారు. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఇప్పుడు పోలీసు ఆఫీస‌ర్ కాదని చెప్పారు. పోక్సో కేసు పెడితే బెదిరించిన‌ట్లా లేక బాదితురాలి ప‌క్షాన ఉన్న‌ట్లా అని ప్రశ్నించారు. కేటీఆర్, బండి సంజ‌య్‌కి మ‌ధ్య ఏముందో తనకు తెలియ‌దని అన్నారు. చ‌ట్ట‌ప్ర‌కారం నిందితులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ కేసు పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు సంబంధించిన అంశమని తెలిపారు. ఏ చిన్న త‌ప్పు చేసినా పిల్ల‌ల జీవితాలు నాశ‌నం అవుతాయని అన్నారు. అమ్మాయికి రెండు బ‌ర్త్ స‌ర్టిఫికెట్స్ ఉన్నాయని.. వాటన్నింటిని పోలీసులు విచారించాలి క‌దా..? అని ప్రశ్నించారు.


నిందితులు త‌ప్పించుకోలేరు..

ఒకరోజు ఆల‌స్యమైన శిక్ష నుంచి నిందితులు త‌ప్పించుకోలేరని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను జైల్లో పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ప‌ట్ల తాను క‌ఠినంగా వ్య‌వ‌హారించానా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ విలీనాన్ని బండి సంజ‌య్ వ్య‌తిరేకించారని కోప‌మా..? అని అడిగారు. తాను స‌త్రం న‌డ‌ప‌టం లేదని.. ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నానని చెప్పుకొచ్చారు. వందశాతం బాదితుల‌కు తమ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందని.. త‌ప్పు చేసిన వారిని శిక్షిస్తామని స్పష్టం చేశారు. డిసెంబ‌ర్‌‌కు ముందే జ‌రిగిన ఘ‌ట‌న‌పైనే బాధితురాలి ఫిర్యాదు వ‌చ్చిందని తెలిపారు. నాలుగు నెల‌లు వెన‌క్కు వెళ్లి అప్ప‌టి ఘ‌ట‌న‌ల‌ను విచారించాలంటే స‌మ‌యం ప‌డుతుందని చెప్పారు. కుమారుడు విషయంలో బండి సంజయ్ తీరు నైతికంగా త‌ప్పు అని తెలిపారు. బండి భగీరథ్ ధైర్యంగా ఈకేసు ఎదుర్కొవాలని అన్నారు. కొడుకును తీసుకువ‌చ్చి బండి సంజ‌య్ స్టేష‌న్‌లో అప్ప‌గించాలని సూచించారు. నోటీసు స‌మ‌యంలో స్పందించ‌క‌పోతే పోలీసులు కఠినంగా వ్య‌వ‌హారిస్తారని స్పష్టం చేశారు. వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌ట్టాలెక్కించాల్సిన బాధ్య‌త ఉందని చెప్పారు. ప్ర‌తి 15 రోజుల‌కు ఒకసారి జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తున్నానని అన్నారు. నిధుల స‌మీక‌ర‌ణపైన ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నానని తెలిపారు. జ‌డ్పీటీసీగా ఉన్న‌ప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే ఇంట్లో ఉన్నానని స్పష్టం చేశారు. క‌ష్ట‌ప‌డ్డ నాయ‌కుల‌కే నామినేటేడ్ పోస్టులు ఇస్తున్నామని అన్నారు. ఇందిర‌మ్మ ఇంట్లో ఉండే వెడ్మ బొజ్జుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని ప్రస్తావించారు. రూపాయి చేతిలో లేని మందుల సామెల్ లాంటి సామాన్యులకి టికెట్ ఇస్తే 50 వేల మెజార్టీతో గెలిచారని గుర్తుచేశారు.


మూసీని ప్ర‌క్షాళ‌న చేస్తాం..

చాక‌లి ఐల‌మ్మ కుటుంబం, శ్రీకాంతాచారి కుటుంబం, కోదండ‌రాం, ఆక‌నూరి ముర‌ళీ ఇలా అంద‌రిని గుర్తుపెట్టుకుని ప‌ద‌వులు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. జ‌య జ‌య‌హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం చేశామని తెలిపారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఏర్పాటు చేశామని అన్నారు. ఎవ‌రు అడ్డువ‌చ్చినా మూసీని ప్ర‌క్షాళ‌న చేస్తామని తేల్చిచెప్పారు. డ్ర‌గ్స్ తీసుకుంటే కఠిన చర్యలు విధిస్తామని స్పష్టం చేశారు. ప్ర‌ధానిగా మోదీ, ముఖ్య‌మంత్రిగా తాను అధికారిక కార్య‌క్ర‌మంలో మాట్లాడానని తెలిపారు. కేంద్రంతో ఆనాటి సీఎం కేసీఆర్ ఏనాడు క‌లిసి రాలేదని అన్నారు. నిధుల కోసం తమతో క‌లిసి రావాల‌ని ప్ర‌ధాని మోదీ అడిగారని ప్రస్తావించారు. ప్ర‌భుత్వాల స‌హ‌కారం గురించి మాత్ర‌మే మాట్లాడారని చెప్పారు. రాజ‌కీయాల్లో తన కమిట్‌మెంట్ గురించి ప్ర‌ధాని మోదీకి తెలుసునని చెప్పుకొచ్చారు. మైక్‌ల ముందే తాము మాట్లాడుకున్నామని.. ర‌హాస్యం ఏం లేదని తేల్చిచెప్పారు. కేంద్రంతో క‌లిసి ర‌మ్మ‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని మోదీ కోరారని ప్రస్తావించారు. తనకు డిమాండ్ ఉంద‌ని అనుకున్నా.. తనకు ఇబ్బంది లేదని చెప్పారు. దేశంలో తనకు డిమాండ్ ఉందని.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గౌర‌వం ఇదని తెలిపారు. రాహుల్‌గాంధీ నాయ‌క‌త్వంలో తాను ప‌నిచేస్తానని అన్నారు. సోనియాగాంధీ లేకుంటే వేయ్యేళ్లయినా తెలంగాణ వ‌చ్చేది కాదని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో చేరిన‌ప్పుడు అధికారంలో లేదని.. తన మ‌న‌సుకు న‌చ్చిన‌ట్లు చేస్తానని తెలిపారు. అవ‌కాశాల కోసం అవ‌కాశ‌వాదీగా మార‌నని స్పష్టం చేశారు. నిబ‌ద్ద‌త‌తో పార్టీలో చేరాన‌నే గాంధీ కుటుంబం తనకు ఈ అవ‌కాశం ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 09:45 PM