Share News

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:23 PM

ప్రముఖ నటి అషురెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. ఒకవైపు ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు ఆమె కుటుంబంపై భారీ మోసం ఆరోపణలు నమోదు కావడం కేసును మరింత క్లిష్టంగా మార్చింది.

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..
Famous Actress Ashu Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ సినీనటి అషురెడ్డి (Famous Actress Ashu Reddy) చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. పెళ్లి పేరుతో తనను, తన కుటుంబాన్ని నమ్మించి దాదాపు రూ. 9.83 కోట్లు మోసం చేసిందంటూ బాధితుడు ధర్మేంద్ర కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన FIRను కొట్టివేయాలని (Quash) కోరుతూ అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.


అసలేం జరిగిందంటే..?

బాధితుడు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ కేసులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. అషురెడ్డి, ధర్మేంద్ర వివాహం చేసుకోవాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి వద్దకు వెళ్లి ఇరు కుటుంబాలు జాతకాలు కూడా చూపించాయని ప్రచారం జరుగుతోంది. పెళ్లి సాకుతో అషురెడ్డి తన వద్ద నుంచి సుమారు రూ. 9.83 కోట్లు వసూలు చేసిందని ధర్మేంద్ర ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఆమె సోదరి దివ్యారెడ్డికి కూడా రూ. 50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లికి అన్ని సిద్ధమవుతున్న తరుణంలో అషురెడ్డి అకస్మాత్తుగా ధర్మేంద్రను వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లు సమాచారం.


బాధితుడు ధర్మేంద్ర సంచలన ఆరోపణలు

అషురెడ్డి తనను మానసికంగా, ఆర్థికంగా వేధించిందని బాధితుడు ధర్మేంద్ర పేర్కొన్నారు. అషురెడ్డి అవసరాల కోసం తాను పలు బ్యాంకుల నుంచి లోన్‌లు తీసుకుని మరీ ఖర్చు చేశానని తెలిపారు. ఇప్పుడు ఆ లోన్‌లు తీర్చలేక ఇబ్బంది పడుతున్నానని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే, తనపై తిరిగి కేసు పెడతానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని అషురెడ్డి బెదిరిస్తోందని ఆయన ఫిర్యాదులో తెలిపారు. తన బాయ్‌ఫ్రెండ్ జయంత్‌తో కలిసి అషురెడ్డి ఈ డ్రామా ఆడిందని, తనను మోసం చేసిందని బాధితుడు వాపోతున్నారు.


పోలీసుల చర్యలు..

బాధితుడి ఫిర్యాదు మేరకు అషురెడ్డి కుటుంబంపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరానికి పాల్పడటం వంటి సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.

హైకోర్టులో అషురెడ్డి పిటిషన్

తనపై వస్తున్న ఆరోపణలను అషురెడ్డి తోసిపుచ్చారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన వెర్షన్ తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా FIR నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులో వాస్తవం లేదని, కాబట్టి ఆ FIRను వెంటనే కొట్టివేయాలని ఆమె కోర్టును వేడుకున్నారు. ఈ కేసు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది. రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా, ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అషురెడ్డి పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్, హరీశ్‌రావు భావోద్వేగ ట్వీట్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 28 , 2026 | 01:28 PM