Share News

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్

ABN , Publish Date - Apr 09 , 2026 | 10:26 AM

బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో బురిడీ కొట్టించారు.

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్
MLA Palla Rajeshwar Reddy

జనగామ , ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు కేవలం సామాన్యులనే కాకుండా, అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఎమ్మెల్యే వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారే మోసపోయారంటే, సామాన్యులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవడమే దీనికి ఏకైక పరిష్కారమని పలువురు చెబుతున్నారు.


కేంద్ర పథకం పేరిట భారీ మోసం

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తిగా నమ్మించడంతో ఎమ్మెల్యే సదరు వ్యక్తి మాటలను విశ్వసించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'వికసిత్ భారత్' పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని నిందితుడు నమ్మించాడు. నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపాలని, దరఖాస్తుకు ఈరోజే చివరి రోజని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచాడు.


డబ్బుల వసూలు..

ఒక్కో దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.2,500ల చొప్పున, మొత్తం 40 మందికి కలిపి రూ. లక్ష తక్షణమే ఫోన్ పే చేయాలని కోరాడు. ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గంట వ్యవధిలోనే ఆ లక్ష రూపాయలను నిందితుడు చెప్పిన నంబర్‌కు బదిలీ చేశారు.


పోలీసుల చర్యలు..

డబ్బులు పంపిన తర్వాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అది నకిలీ కాల్ అని తెలియడంతో ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. సైబర్ నిందితులపై ఈ క్రింది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 319 (2), 318 (4), ఐటీ యాక్ట్ 66c, 66d కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల పేర్లతో ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, వెంటనే నగదు బదిలీ చేయకుండా సంబంధిత శాఖల ద్వారా క్రాస్ చెక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏ ప్రభుత్వ పథకానికి కూడా వ్యక్తిగత ఫోన్ పే నంబర్లకు డబ్బులు పంపాలని అధికారులు కోరారని అన్నారు. చెల్లింపులు ఎప్పుడూ అధికారిక పోర్టల్స్ లేదా చలాన్ల ద్వారానే జరుగుతాయని తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాళేశ్వరంపై విచారణ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 10:32 AM