Share News

ఫేక్ ఈ-చలాన్ లింక్స్‌తో జాగ్రత్త.. సైబర్ పోలీసుల కీలక సూచనలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 09:21 AM

ఇటీవల, ఫేక్ ఈ-చలాన్ మోసాల కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఈ మోసాలకు గురి కాకుండా కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఫేక్ ఈ-చలాన్ లింక్స్‌తో జాగ్రత్త.. సైబర్ పోలీసుల కీలక సూచనలు
Online Fraud

హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, ఫేక్ ఈ-చలాన్ (Fake E-Challan) మోసాల గురించి సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) పలు సూచనలు జారీ చేశారు. మీరు వాహనం నడుపుతున్నారా..? మీకు ‘ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉంది’ అని SMS, WhatsApp, లేదా ఇమెయిల్ ద్వారా సందేశం వస్తే, ఆ లింక్‌పై తక్షణమే క్లిక్ చేయకూడదు. ఈ ఫేక్ లింక్‌లు మిమ్మల్ని సైబర్ క్రిమినల్స్ రూపొందించిన నకిలీ వెబ్‌సైట్‌కి తీసుకెళ్తాయి, అక్కడ మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా, కార్డ్ సమాచారం, UPI పిన్, OTP వంటి సెన్సిటివ్ సమాచారాన్ని అడుగుతారు. మోసగాళ్లు ఈ విధంగా మీకు భయాన్ని సృష్టించి, “తక్షణం చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది” అనే సూచనలతో మిమ్మల్ని నమ్మిస్తారు. ఒకసారి మీరు వివరాలు ఇచ్చిన వెంటనే, డబ్బు క్షణాల్లో ఖాళీ చేస్తారని వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


ఫేక్ ఈ-చలాన్ స్కామ్

సైబర్ నేరగాళ్లు ప్రజల భయాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కొత్త రకం మోసాలకు తెరలేపారు. వీరు ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ పంపినట్లుగా ఉండే సందేశాలను ఎస్ఎంఎస్, వాట్సాప్, లేదా ఈమెయిల్ ద్వారా పంపుతారు. ఈ మెసేజ్‌లో మీ వాహనంపై చలాన్ పెండింగ్‌లో ఉంది. వెంటనే చెల్లించకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. చలాన్ చెల్లించడానికి ఈ కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి. ఇలాంటి సందేశాలు చూడగానే చాలామంది కంగారుపడి అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తారు. మీరు ఆ లింక్‌ను క్లిక్ చేయగానే, అది సరిగ్గా ప్రభుత్వ 'పరివాహన్' (Parivahan) పోర్టల్‌లాగే కనిపించే నకిలీ వెబ్‌సైట్‌కు మిమ్మల్ని తీసుకెళ్తుంది. అక్కడ మీ పేరు, వాహనం నంబర్, ఫోన్ నంబర్ వంటి వివరాలు అడుగుతారు. చలాన్ కట్టమని అడుగుతూ ఓ అనుమానాస్పద పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు, యూపీఐ (UPI) పిన్ ఎంటర్ చేయగానే, ఆ సమాచారం సైబర్ క్రిమినల్స్ చేతికి వెళ్తుంది. దీనితో క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయం అవుతుంది. ఈ సూచనలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.


ఈ లింక్‌లను క్లిక్ చేయొద్దు :

తెలియని నంబర్ల నుంచి వచ్చే ఈ-చలాన్ లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. మీకు చలాన్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేరుగా గూగుల్‌లో echallan.parivahan.gov.in అని టైప్ చేసి చెక్ చేయండి. లేదా అధికారిక mParivahan యాప్‌ను మాత్రమే వాడాలి.

రహస్య సమాచారాన్ని షేర్ చేయొద్దు..

బ్యాంక్ అధికారులు, పోలీసులు ఎప్పుడూ మీ ఓటీపీ (OTP), బ్యాంక్ పాస్‌వర్డ్, లేదా కార్డ్ సీవీవీ (CVV) వివరాలు అడగరని గుర్తుంచుకోండి. వీటిని ఎవరికీ చెప్పకండి.

యూఆర్ఎల్ (URL) పరిశీలన..

ఏదైనా పేమెంట్ చేసే ముందు వెబ్‌సైట్ అడ్రస్ బార్‌లో ఉన్న యూఆర్ఎల్‌ని ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి.


మోసం జరిగితే ఏం చేయాలంటే..?

ఒకవేళ మీరు పొరపాటున ఇలాంటి లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే 1930 అనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి. www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. మీ బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి కార్డులను బ్లాక్ చేయించండి. సాంకేతికత పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అప్రమత్తతే మనకు రక్షణ అని పోలీసులు తెలిపారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని షేర్ చేసి వారిని సైబర్ నేరాల బారిన పడకుండా ఉంచవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

రిసార్ట్‌‌లో సౌకర్యాలు ఉండేవి ఇలాగేనా.. వారిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 09:22 AM