శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం.. ఆ విమానానికి బెదిరింపు మెయిల్..
ABN , Publish Date - May 24 , 2026 | 09:12 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంతర్జాతీయ విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన ఒక మెయిల్ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు (Shamshabad Airport Bomb Threat) రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమ్‌స్టర్‌డామ్ (Amsterdam) నుంచి హైదరాబాద్ వస్తున్న అంతర్జాతీయ విమానంలో మానవ రహిత బాంబు ఉందంటూ వచ్చిన ఒక మెయిల్ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న 'KLM-873' నెంబర్ గల అంతర్జాతీయ విమానంలో మానవ రహిత బాంబు ఉందంటూ ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఒక ఈమెయిల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ఈ బెదిరింపు మెయిల్ పంపినట్లు సమాచారం. ఆ మెయిల్‌లో... ‘విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా బాంబు పేలవచ్చు’ అని తెలిపాడు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు.
అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది..
బాంబు బెదిరింపు మెయిల్ అందిన వెంటనే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, శంషాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. విమానం ల్యాండింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రన్‌వే పరిసరాల్లో అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచారు. తీవ్ర ఉత్కంఠ నడుమ, ప్రయాణికులతో వస్తున్న KLM-873 విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ అయింది. విమానం భూమిపైకి రాగానే, పైలట్లకు సమాచారం అందించి రన్‌వే పైనుంచి నేరుగా ఎయిర్‌పోర్టులోని అత్యంత సురక్షితమైన 'ఐసోలేషన్ బే' (Isolation Bay) ప్రాంతానికి తరలించారు. అనంతరం అత్యంత వేగంగా విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, వారిని ప్రత్యేక ‘ఐసోలేషన్ బే' ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందకుండా అధికారులు ఎప్పటికప్పుడు భరోసా కల్పించారు.
క్షుణ్ణంగా తనిఖీలు..
ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి చేర్చిన తర్వాత, బాంబు స్క్వాడ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో విమానంలో తనిఖీలు చేపట్టారు. విమానంలోని ప్రెజర్ క్యాబిన్, కార్గో విభాగం, ప్రయాణికుల సీట్లు, వారి లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు, బాంబు కానీ లేవని సెక్యూరిటీ అధికారులు నిర్ధారించారు. ఇది ఫేక్ మొయిల్ అని తేలడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఔట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు.. విచారణ ముమ్మరం..
ఇది ఫేక్ మెయిల్ అని తీవ్రంగా పరిగణించిన విమానాశ్రయ ఉన్నతాధికారులు, వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది?, ఐపీ అడ్రస్ ఎవరిది? , ఏ ఉద్దేశంతో విమానాశ్రయాన్ని, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు? అనే కోణంలో పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం విచారణను ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హైదరాబాద్ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా ఎదగాలి: కిషన్‌రెడ్డి
బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
Read Latest Telangana News And AP News And International News And Telugu News