Share News

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్.. వెలుగులోకి భారీ అక్రమాస్తులు

ABN , Publish Date - May 23 , 2026 | 08:51 AM

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు వెలుగులోకి రావడంతో సోదాల అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్.. వెలుగులోకి భారీ అక్రమాస్తులు
Deputy Collector Vamsi Mohan Arrest

హైదరాబాద్, మే23 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈరోజు(శనివారం) అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు వెలుగులోకి రావడంతో సోదాల అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏసీబీ అధికారులు నిర్వహించిన విస్తృత సోదాల్లో వంశీ మోహన్‌కు సంబంధించిన భారీ ఆస్తులు బయటపడ్డాయి. మొత్తం 19 ఇళ్ల స్థలాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. అలాగే వనస్థలిపురంలో విలాసవంతమైన ఇల్లు, మణికొండ, మజీద్‌బండ ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.


డిప్యూటీ కలెక్టర్ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగా..

అదేవిధంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో రెండు ఎకరాల ఫాంహౌస్ కూడా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఖాతాల్లో రూ.20 లక్షల డిపాజిట్లు, ఇంట్లో రూ.2.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 122 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా సీజ్ చేశారు. రెండు ఖరీదైన కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల అంచనా ప్రకారం బయటపడిన ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. అయితే అధికారిక రిజిస్ట్రేషన్ విలువ మాత్రం రూ.6.22 కోట్లుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యత్యాసం కూడా దర్యాప్తులో కీలకంగా మారింది. వంశీ మోహన్‌పై భూకుంభకోణాలకు సంబంధించిన పలు ఆరోపణలు ఉన్నాయి. తన మేనమామ పేరిట 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమి డీల్‌కు బదులుగా 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.


2019 నుంచి 2023 వరకు పలు అక్రమాలు

2019 నుంచి 2023 వరకు శేరిలింగంపల్లి ఎమ్మార్వోగా పనిచేసిన సమయంలోనే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా సాహెబ్‌నగర్‌లో నాలుగు ప్లాట్లను అక్రమంగా రెగ్యులరైజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. వంశీ మోహన్‌కు సన్నిహితంగా ఉన్న ఓ రియల్టర్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ కీలక పత్రాలు, భూముల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరు అధికారుల పాత్రపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారుల అవినీతి వ్యవహారాలపై ఏసీబీ దూకుడు పెంచిన నేపథ్యంలో ఈ అరెస్ట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. వంశీ మోహన్ కేసులో ఇంకా మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్

కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 23 , 2026 | 09:29 AM