ఆ భూములను రేవంత్ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోట్లేదు: మహేశ్వర్ రెడ్డి
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:56 PM
నాడు ధరణి, నేడు భూభారతి రెండు వ్యవస్థలు ఒక్కటేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): నాడు ధరణి, నేడు భూభారతి రెండు వ్యవస్థలు ఒక్కటేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో లక్షల ఎకరాలను బీఆర్ఎస్ నేతలు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు అసెంబ్లీలో చెప్పారని.. కానీ ఆ భూములను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోట్లేదని ప్రశ్నించారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లో మీడియాతో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యుల మీద ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. గతంలో రిజిస్ట్రేషన్లు తప్పుడుగా జరిగినట్లే, భూభారతి తీసుకొచ్చాక కూడా రిజిస్ట్రేషన్లు అలాగే జరిగాయని ప్రస్తావించారు. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. అవసరం లేని భూములను 22ఏ లో చేర్చడంతోనే ఈ సమస్య తలెత్తిందని తెలిపారు.
పైరవీలు చేస్తున్నారు..
బాధితులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని.. పైరవీకారులు కుర్చీలో కూర్చొని పైరవీలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరి మీద వ్యక్తిగత విద్వేషం తమకు లేదని చెప్పుకొచ్చారు. సలహాలు తీసుకుంటే మీ ఇష్టం.. తీసుకోకపోతే ప్రజలే సమాధానం ఇస్తారని అన్నారు. నాడు ధరణి.. నేడు భూభారతి ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని తెలిపారు. ల్యాండ్ లాక్ చేసింది అధికారులే కదా !.. ఆ అధికారులు ఎవరు.?, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరణి పోయాక.. భూభారతి వచ్చిన తర్వాత కూడా భూ బదలాయింపులు అక్రమంగా జరిగాయని ఆరోపించారు. ధరణిలో జరిగిన తప్పిదాల్లో బాధ్యులైన వారిపై చర్యలేవీ.? అని ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆడిట్‌లో జరిగిన తప్పిదాలపై ఏనాడైనా చర్చ చేశారా.? అని నిలదీశారు.
వారిపై చర్యలేవీ.?
ఐఏఎస్ అధికారులు అమాయ్ కుమార్, హరీశ్ లాంటి వారిపై చర్యలేవీ.? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. నవీన్ మిత్తల్ లాంటి అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రజలకు ఏం చెప్పాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటోందని నిలదీశారు. అసైన్డ్ భూములు లబ్ధిదారుడి దగ్గర లేదని.. ప్రభుత్వం దగ్గర లేదని.. అక్కడ ప్రైవేట్ వ్యక్తులు భారీ టవర్లు కడుతున్నారని చెప్పుకొచ్చారు. లొసుగులతోనే తప్పిదాలు చేస్తున్నారని.. రాత్రికి రాత్రి 22ఏ భూముల అంశం నుంచి చేర్చడం ఎలా.?, ఎలా తొలగింస్తున్నారు.?, పేదలు కట్టుకున్న ఇళ్లు.. 22ఏ లో చేరిస్తే వాళ్ల పరిస్థితి ఏంటి.? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేత్రపర్వంగా ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్
చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేసింది వీరే.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News