తెలంగాణలో బ్యాలెట్ ఎన్నికలకు సిద్ధమా?.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
ABN , Publish Date - Oct 31 , 2026 | 08:26 PM
తెలంగాణలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలకు వెళ్తే బీజేపీ ఎంపీలు , ఎమ్మెలేలు రాజీనామా చేసేందుకు సిద్ధమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమైతే తాను, తమ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలకు వెళ్తే బీజేపీ ఎంపీలు, ఎమ్మెలేలు రాజీనామా చేసేందుకు సిద్ధమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) సవాల్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమైతే తాను, తమ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తామని స్పష్టం చేశారు. ఈనాటి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియతోనే దేశంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయాందా..? అని ప్రశ్నించారు. తమిళనాడులో 60 ఏళ్ల నుంచే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని ప్రస్తావించారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 2004లో చనిపోతే ఆయన ఓటు ఇంకా ఉందని, తొలగించాలా? వద్దా అని ప్రశ్నించారు. ఈ దేశం కాని వాళ్లు అక్రమంగా వలస వచ్చి ఓటర్‌గా నమోదు చేసుకుని ఈ దేశ రాజకీయాలను శాసిస్తామంటే ఊరుకోవాలా అని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో 50 ఏళ్లుగా అధికారంలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ఆ రాష్ట్రాల్లో ఓడిపోయారు..
సిక్కింలో 1975లో రాష్ట్ర హోదా పొందినప్పటి నుంచి ఒక్కసారి కూడా అధికారంలోకి కాంగ్రెస్ రాలేదని బండి సంజయ్ గుర్తుచేశారు. యూపీలో 37 ఏళ్లుగా, బీహార్‌లో 36 ఏళ్లుగా, త్రిపురలో 34 ఏళ్లుగా, గుజరాత్‌లో 31 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలోకి రానేలేదని స్పష్టం చేశారు. ఒడిశా, జార్ఖండ్‌లో 26 ఏళ్లుగా, మధ్యప్రదేశ్, నాగాలాండ్‌లో 23 ఏళ్లుగా, గోవాలో 14 ఏళ్లుగా కాంగ్రెస్‌కు అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్రాలో 12 ఏళ్లుగా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో పదేళ్లుగా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లో 9 ఏళ్లుగా హస్తం పార్టీ అధికారంలోనే లేదని చెప్పుకొచ్చారు. మేఘాలయ, మిజోరాంలో 8 ఏళ్లుగా, పంజాబ్‌లో 4 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలోకి ఎందుకు రాలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. 2014 నుంచి కాంగ్రెస్ ఓడిపోతునే ఉందని అన్నారు.
ఓడిపోతే ఈవీఎంలపైనా కాంగ్రెస్ విష ప్రచారం..
కేరళం, తెలంగాణ, కర్ణాటకలో ఈ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ గెలిచిందని బండి సంజయ్ ప్రస్తావించారు. ఓడిపోతే ఈవీఎంలపైనా విష ప్రచారం చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని ధ్వజమెత్తారు. ఈవీఎంలతో తొలిసారి ఎన్నికలకు వెళ్లిందే రాజీవ్ గాంధీ హయాంలో అని గుర్తుచేశారు. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. అస్సాంలో బ్యాలెట్‌తో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని తెలిపారు. తెలంగాణలో బ్యాలెట్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. నిన్నటికి నిన్న 4 రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో జరిగిన 28 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News