Share News

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:18 AM

ఆంధ్రకు నీళ్లు... తెలంగాణకు ఎక్కిళ్లు అన్నట్టుగా పరిస్థితి ఉందని, రైతుల కష్టాలపై సీఎం రేవంత్‌ రెడ్డికి పట్టింపు లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు
KTR

  • చంద్రబాబు 700 కి.మీ. మేర నీళ్లు తీసుకెళ్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారు?

  • ఎల్‌నినో వల్ల కాదు.. కాంగ్రెస్‌ వల్లే ఈ కరువు

  • బుద్ధి ఉన్నోడు రేవంత్‌లా మారాలనుకుంటాడా?

  • సమస్యల కన్నా నా గడ్డంపైనే ఆయనకు ఫికర్‌

  • ఇప్పటికైనా రైతు బంధు బకాయిలు చెల్లించాలి

  • అష్ట గ్రహాలుగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు

  • తెలంగాణ కోసం కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి

  • నిర్మల్‌ రైతు గర్జన సభలో కేటీఆర్‌

నిర్మల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకు నీళ్లు... తెలంగాణకు ఎక్కిళ్లు అన్నట్టుగా పరిస్థితి ఉందని, రైతుల కష్టాలపై సీఎం రేవంత్‌ రెడ్డికి పట్టింపు లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు 700 కి.మీ మేర కృష్ణా నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. నిర్మల్‌లో బుధవారం నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. పెండింగ్‌లో ఉన్న మూడు విడతల రైతుబంధుతో పాటు యాసంగి రైతుబంధును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఇస్తామన్న బోనస్‌ బోగ్‌సగా మారిందని, యూరియా కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.


రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆక్షేపించారు. వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలని జూలైలోనే సూచించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యం కారణంగా రైతుల ఇంటి ముందు మళ్లీ చావు డప్పు మోగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం, సీతారామ, భక్త రామదాసు, సదర్‌మాట్‌ వంటి ప్రాజెక్టులను నిర్మించి సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు. విద్యుత్‌ కష్టాలను తొలగించి, సింగరేణికి కొత్త జీవం పోశామని పేర్కొన్నారు. 4.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులను సాధించడంలో బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు విఫలమయ్యారని కేటీఆర్‌ విమర్శించారు.


బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై నోరెత్తేందుకు కూడా సాహసించడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అష్ట గ్రహాలుగా మారారని ధ్వజమెత్తారు. ప్రశ్నించలేని నాయకులకు ఓట్లేసి లాభమేంటో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్‌ను ఉద్దేశించి.. చెప్పులు మోసే పార్టీ ఒకటి, సంచులు మోసే పార్టీ మరొకటి అని విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలను ఢిల్లీ వరకు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల కాంగ్రెస్‌ పాలనను ప్రజలు చూశారని, మళ్లీ మోసపోతే గోసపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రగతి రథచక్రం ముందుకు సాగాలంటే కేసీఆర్‌ తిరిగి సీఎం కావాలని ఆకాంక్షించారు. ‘‘కేటీఆర్‌ ఎన్నటికీ రేవంత్‌ కాలేడు’’ అని సీఎం చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘బుద్ధి ఉన్నోడు ఎవడైనా రేవంత్‌లా మారాలనుకుంటాడా? ప్రజలు ఆయన్ను తిట్టే తిట్లు వింటే.. మరొకరైతే బకెట్లో దూకి చచ్చిపోతుండె. రాష్ట్ర సమస్యలకంటే నా గడ్డంపైనే ఆయనకు ఎక్కువ ఫికర్‌ ఉంది. ఇంకా నేను నకలు కొడుతున్నానంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నడు’’ అని ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మూసీ ప్రక్షాళన చేయాల్సిందే

ముస్లిం రిజర్వేషన్లను తొలగించేవాడు ఇంకా పుట్టలేదు

వరి పంట తప్ప..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 04:18 AM