Share News

వరి పంట తప్ప..!

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:06 AM

రాష్ట్రంలో యాసంగి సాగు విషయంలో వ్యవసాయ శాఖ ఆచితూచి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎల్‌నినో కారణంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తోంది.

వరి పంట తప్ప..!
Telangana Rabi Crop Plan 2026

  • రైతులు ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి

  • నీటి నిల్వల ఆధారంగా మూడు క్యాటగిరీలుగా విభజన

  • నూనె గింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుకే ప్రాధాన్యం

  • యాసంగిలో పంటల సాగుపై వ్యవసాయ శాఖ ప్రణాళికలు

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి సాగు విషయంలో వ్యవసాయ శాఖ ఆచితూచి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎల్‌నినో కారణంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తోంది. సాగునీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని యాసంగి ప్రణాళికలు తయారు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), మండల వ్యవసాయ అధికారుల (ఏవో)తోపాటు డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులకు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మూడు వేర్వేరు క్యాటగిరీల్లో సాగు చేయడానికి పలు రకాల పంటలను సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేయాల్సిన పంటల జాబితానే వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.


మొదటి కేటగిరీలో.. తొలి కేటగిరీలో తక్కువ నీటితో సాగు చేసే పంటల జాబితాను రూపొందించారు. శనగ, జొన్న, కుసుమ, పెసర, మినుము, సజ్జ లాంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. యాసంగిలో జొన్న సాగు సాధారణ విస్తీర్ణం 2.56 లక్షల ఎకరాలున్నప్పటికీ నిరుడు యాసంగిలో 4 లక్షల ఎకరాలకుపైగా సాగు చేశారు. ఈసారి దీన్ని 5 నుంచి 6 లక్షల ఎకరాలకు పెంచాలని వ్యవసాయశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. శనగ సాధారణ విస్తీర్ణం కూడా 2.76 లక్షల ఎకరాలే ఉంది. నిరుడు సాధారణ విస్తీర్ణం కూడా దాటలేదు. సజ్జల సాధారణ విస్తీర్ణం 11 వేల ఎకరాలుంటే.. నిరుడు 8 వేల ఎకరాలకు మించలేదు. మినుములు 53 వేల ఎకరాలుండగా నిరుడు 36 వేల ఎకరాల్లోనే సాగుచేశారు. దీన్ని లక్ష ఎకరాలు దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


రెండో కేటగిరీలో.. మధ్యస్థ నీటి వనరులతో సాగు చేసే పంటల జాబితాను వెల్లడించారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు వంటి పంటలను రైతులు సాగు చేయాలని పేర్కొన్నారు. ఇందులో ప్రధానపంట మొ క్కజొన్న. సుమారు 9లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉంటే.. నిరుడు రికార్డు స్థాయిలో 16.75 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. దిగుబడి కూడా గణనీయంగా వచ్చింది. పొద్దుతిరుగుడు సాధారణ విస్తీర్ణం 27 వేల ఎకరాలుంటే.. నిరుడు 28 వేల ఎకరాలు దాటింది. ఈ యాసంగిలో 50 వేల ఎకరాలకు మించి సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేరుశనగ 2.37 లక్షల ఎకరాలుంటే.. నిరుడు 1.61 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది.


మూడో కేటగిరీలో.. పుష్కలమైన నీటి వసతి, మార్కెట్‌ సౌకర్యం ఉన్న ప్రాంతాలను, రైతులను మూడో కేటగిరీలో చేర్చారు. నీటి లభ్యత ఎక్కువ ఉన్నప్పటికీ రైతులు కూరగాయలు మాత్రమే సాగు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. దీంతో వీటి సాగును పెంచాలని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మూసీ ప్రక్షాళన చేయాల్సిందే

ముస్లిం రిజర్వేషన్లను తొలగించేవాడు ఇంకా పుట్టలేదు

ఆస్తి పన్ను నంబరు ఉంటేనే.. రిజిస్ట్రేషన్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 04:11 AM