Share News

ఆస్తి పన్ను నంబరు ఉంటేనే.. రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:43 AM

‘హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌)’ పరిధిలో ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయాలంటే ఆస్తి పన్ను మదింపు తప్పనిసరి కానుంది.

ఆస్తి పన్ను నంబరు ఉంటేనే.. రిజిస్ట్రేషన్‌
Hyderabad Property Registration

  • భవనం, ఫ్లాట్‌, ఓపెన్‌ ప్లాట్లకు పీటీఐఎన్‌/వీఎల్‌టీఐఎన్‌ నంబర్‌ ఉండాల్సిందే!

  • ఆ నంబరు నమోదు చేస్తేనే స్లాట్‌ బుకింగ్‌

  • లేకపోతే పీటీఐఎన్‌ తీసుకుని, పన్ను కట్టాకే రిజిస్ట్రేషన్‌

  • ఒకవేళ అత్యవసరమైతే పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌ వెసులుబాటు

  • నంబరు తీసుకుని, పన్ను చెల్లించాకే డాక్యుమెంట్‌ విడుదల

  • క్యూర్‌ పరిధిలో అమలు చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు

  • పన్నుల వసూళ్లకు మంచిదే.. రిజిస్ట్రేషన్లకు మాత్రం ఇబ్బంది

  • సాధారణంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ వచ్చాకే ఫ్లాట్లకు పన్ను

  • నిర్మాణ దశలోనే ఫ్లాట్ల అమ్మకం, రిజిస్ట్రేషన్‌ ఎలా..?

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌)’ పరిధిలో ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయాలంటే ఆస్తి పన్ను మదింపు తప్పనిసరి కానుంది. ఆస్తి పన్ను గుర్తింపు నంబరు (పీటీఐఎన్‌)/ఖాళీ స్థలాల పన్ను గుర్తింపు నంబరు (వీఎల్‌టీఐఎన్‌) ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సబ్‌రిజిస్ట్రార్లు ఏదైనా ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేసేప్పుడు మూడు అంశాలను చూడాలని ప్రభుత్వం తాజాగా పేర్కొంది. రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ కూడా జరిగేలా చూడటం, ఆస్తి పన్ను గుర్తింపు నంబరు ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయడం. మొదటి రెండూ ఇప్పటికే ఉన్నవేకాగా, మూడో అంశం కొత్తగా చేర్చారు.


ఈ మేరకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ బుధవారం ఒక మెమో జారీచేశారు. దీని ప్రకారం ఇకపై ఎవరైనా ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే... స్లాట్‌ బుక్‌ చేసే సమయంలోనే పీటీఐఎన్‌ నంబరును తప్పనిసరిగా నమోదు చేయాలి. లేకుంటే స్లాట్‌ బుక్‌ చేయడం కుదరదు. పీటీఐఎన్‌ నంబరు ఉండి, పన్ను బకాయిలు ఉంటే.. స్లాట్‌ బుక్‌ అవుతుంది. ఆస్తి పన్ను వివరాలతో దరఖాస్తుదారుకు, మున్సిపల్‌ అధికారులకు ఎస్సెమ్మె్‌సలు వస్తాయి. ఇది అలర్ట్‌ మాత్రమేనని, దానివల్ల రిజిస్ట్రేషన్‌ ఆపబోరని, ప్రక్రియ పూర్తి చేసేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే సదరు బకాయిల వసూళ్లకు మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపడతారని వెల్లడించాయి.


పీటీఐఎన్‌ నంబరు లేకపోతే..?

ఆస్తిపన్ను మదింపు నంబరు లేకుంటే.. రిజిస్ట్రేషన్‌ దరఖాస్తుదారులకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి 48 గంటల తర్వాత స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఆ సమయంలోగా మున్సిపల్‌ అధికారులు పన్ను మదింపు చేసి నంబరు ఇవ్వాలి. అధికారులు మదింపు చేసి నిర్ణయించిన మేరకు దరఖాస్తుదారు పన్ను మొత్తం చెల్లించాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ జరిగిపోతుంది. డాక్యుమెంట్‌ను వెంటనే అందజేస్తారు. ఇక రెండోది పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌. అంటే వెంటనే రిజిస్ట్రేషన్‌ కావాలనుకున్న వారికి ప్రక్రియను పూర్తిచేస్తారు. కానీ డాక్యుమెంటును పెండింగ్‌లో పెడతారు. పన్ను మదింపు నంబరు తెచ్చుకుని, పన్ను మొత్తం చెల్లించాక.. సాధారణ రిజిస్ట్రేషన్‌గా పరిగణించి డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే వారి పేరు కార్పొరేషన్‌, పట్టణాభివృద్ధి సంస్థల రికార్డుల్లో ఆటోమేటిగ్గా అప్‌డేట్‌ అవుతుంది. మ్యుటేషన్‌ సర్టిఫికెట్‌ కూడా వస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మున్సిపల్‌ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.


నిర్మాణంలో ఉన్న, ఇప్పుడే పూర్తయిన అపార్ట్‌మెంట్ల పరిస్థితేమిటి?

కొత్త నిబంధనతో నిర్మాణ దశలోని అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్ల సంగతేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఒక బిల్డర్‌ 20 ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్‌ కడుతున్నారు. అందులో మున్సిపాలిటీకి మార్టిగేజ్‌ పెట్టినవి తప్ప మిగతావాటిని నిర్మాణ దశలోనే విక్రయించవచ్చు. రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. కానీ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ పూర్తయ్యాక మాత్రమే పన్ను మదింపునకు వెళ్తారు. అప్పటినుంచే పన్ను కడతారు. కానీ ఇప్పుడు పీటీఐఎన్‌ నంబరు తప్పనిసరి చేయడంతో నిర్మాణ దశలో అమ్మకం, రిజిస్ట్రేషన్ల సంగతేమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే నిర్మాణం పూర్తిచేసుకున్న అపార్ట్‌మెంట్లకు కూడా పన్ను మదింపు కావడానికి సమయం పడుతుందని.. అప్పటివరకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయా? అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇక అసెస్‌మెంట్‌ నంబరు లేని వారికి... రెండు రోజుల్లో అసె్‌సమెంట్‌ నంబరు తీసుకుంటే రిజిస్ట్రేషన్‌ అవుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ మెమోలో పేర్కొంది. ఒకవేళ రెండురోజుల్లో మున్సిపల్‌ సిబ్బంది అసె్‌సమెంట్‌ చేయకపోతే ఎలాగన్న స్పష్టత లేదు. కొత్త విధానం పన్నుల వసూళ్లకు మంచిదే అయినా.. రిజిస్ట్రేషన్లకు ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

హైడ్రా రంగనాథ్‌ను హాజరుపరచండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:44 AM