ఇంటర్‌కు ఇక సెలవు!
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:03 AM
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య ముగియనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 11, 12 తరగతులు పాఠశాల విద్యలో భాగం కానున్నాయి.
1969 నుంచి కొనసాగుతున్న విధానానికి తెర
కొత్త విధానంలో నర్సరీ నుంచి 4 వరకు ప్రాథమిక విద్య, 5-8 సెకండరీ, 9-12 సీనియర్ సెకండరీ
వచ్చే ఏడాది నుంచి బడుల్లోనే 11, 12 తరగతులు
సీబీఎస్ఈ, మెజారిటీ రాష్ట్రాల్లా 10+2 విధానం
కార్పొరేట్ కాలేజీల ఒత్తిడి ఉన్నా తలొగ్గను
నా నిర్ణయాలు నచ్చకపోతే అధికారులు నిర్మొహమాటంగా నాతోనే చెప్పవచ్చు
సంస్కరణల గురించి అధికారులూ మాట్లాడాలి
డ్రాపౌట్స్‌ను తగ్గించడం, స్కిల్స్ పెంచడమే లక్ష్యం
విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య ముగియనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 11, 12 తరగతులు పాఠశాల విద్యలో భాగం కానున్నాయి. సీబీఎ్‌సఈతో పాటు దేశంలో మెజారిటీ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 10+2 విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచే అమలు చేయాలని సీఎం భావించినా, సమయం సరిపోదని అధికారులు చెప్పడంతో వాయిదా పడింది.
ఈసారి తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని బుధవారం జరిగిన సమీక్షలో సీఎం తేల్చిచెప్పారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు విద్యామంత్రిగా ఉన్నప్పుడు 1969-70లో మొదలైన ఇంటర్ విధానం దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ముగియనుంది. కొత్త విధానంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8 వరకు సెకండరీ, 9 నుంచి 12 వరకు సీనియర్ సెకండరీ విద్యగా పునర్ వ్యవస్థీకరించాలని సీఎం ఆదేశించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దేశంలో 18 రాష్ట్రాల్లో 10+2 విధానమే అమల్లో ఉందని, విద్యార్థుల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విద్యాశాఖలో తాను తీసుకునే ప్రతి నిర్ణయానికి విద్యార్థే కేంద్రమని, మరే అంశానికీ తావు లేదని అన్నారు.
కార్పొరేట్ ఒత్తిడికి తలొగ్గను
‘ప్రభుత్వ నిర్ణయంతో కార్పొరేట్ కాలేజీలకు నష్టం జరుగుతుంది. దీనిపై నా మీద తీవ్ర ఒత్తిడి ఉంది. అయినా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎక్కడా తలొగ్గకుండా ముందుకు వెళ్తున్నా’ అని సీఎం ఉన్నతాధికారులతో అన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వమే కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రకటించామన్నారు. తన నిర్ణయాల్లో లోటుపాట్లు ఉంటే నేరుగా తనకే చెప్పాలని, మరింత మెరుగ్గా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన నిర్ణయాలు నచ్చకపోతే అధికారులు తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పవచ్చన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీ అందరిదీ. విద్యారంగంలో సంస్కరణల గురించి నేనొక్కడినే చెబితే సరిపోదు. మీరందరూ మాట్లాడాలి‘ అని కోరారు.
పదో తరగతి తర్వాత 40 శాతం డ్రాపౌట్
పదో తరగతి తర్వాత సగటున 40శాతం విద్యార్థులు చదువు మానేస్తున్నారని సీఎం చెప్పారు. వారిలో ఎక్కువ మంది బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలేనని అన్నారు. 11, 12 తరగతులు బడుల్లోనే ఉండే కేంద్రీయ, నవోదయ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. డ్రాపౌట్లను అరికట్టడం, విద్యార్థుల్లో భాషా, సమాచార నైపుణ్యాలు పెంచడమే కొత్త విధానం లక్ష్యమని వివరించారు. 12వ తరగతి తర్వాత విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టు ఎంచుకుని అందులో నిపుణులుగా ఎదిగే అవకాశం ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ.1.08 లక్షలు ఖర్చవుతోందని చెప్పారు. ఇంటర్ కాలేజీల విలీనంతో అది రూ.60 వేలకు తగ్గుతుందని, మిగిలే రూ.48 వేలను మళ్లీ విద్యా రంగానికే వెచ్చిస్తామని తెలిపారు. నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు నాణ్యమైన బోధనతో విద్యార్థులను ఆధునిక ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, అందులో భాగంగానే ఈ సంస్కరణలని చెప్పారు. జూనియర్ కాలేజీల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు.
జూనియర్ కాలేజీలే సీనియర్ సెకండరీ బడులు
సీఎం ఆదేశాలతో ఇంటర్ విద్య పాఠశాల విద్యలో విలీనం కానుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పాఠశాల విద్యా శాఖ పరిధిలోకి వస్తాయి. వచ్చే ఏడాది నుంచి ఇవి 9-12 తరగతులతో సీనియర్ సెకండరీ స్కూళ్లుగా మారనున్నాయి. దాదాపు అన్ని కాలేజీలకు విశాలమైన స్థలం ఉండటంతో, వాటిలోనే 9, 10 తరగతులు ప్రారంభించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదనపు తరగతి గదులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే ఈ భవనాలు సరిపోతాయని ఇంటర్ బోర్డు ప్రతిపాదిస్తోంది. చాలా కాలేజీలు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 0-5 కి.మీ. దూరంలోనే ఉన్నాయి. అందువల్ల 8వ తరగతి పూర్తయ్యాక విద్యార్థులు దగ్గర్లోని కాలేజీ భవనాల్లో 9-12 తరగతుల్లో చేరడానికి ఇబ్బంది ఉండదని బోర్డు చెబుతోంది.
మండలానికో ’12వ తరగతి’ బడి
ఆరుట్ల తరహాలో 120 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇవి ఏడాదిలో అందుబాటులోకి వస్తాయి. మరో 300 టీపీఎస్‌ల కోసం నాబార్డు రుణానికి దరఖాస్తు చేసింది. రుణం మంజూరైతే టీపీఎస్‌ల సంఖ్య 420కి చేరుతుంది. 12వ తరగతి వరకు బోధిస్తున్న 195 మోడల్ స్కూళ్లను కలిపితే 615 బడులు అవుతాయి. ప్రభుత్వ, జడ్పీ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఒకే చోట ఉన్న 70 సంస్థలను కూడా కలిపితే మొత్తం 685 సంస్థల్లో 12వ తరగతి వరకు బోధన సాధ్యమని విద్యాశాఖ చెబుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 621 మండలాలు ఉన్నాయి. కొత్త టీపీఎస్‌లు పూర్తయితే ప్రతి మండలంలో 12వ తరగతి వరకు ఉండే కనీసం ఒక బడి ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
1న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు డిసెంబరు 1న నోటిఫికేషన్ ఇచ్చి, ఏప్రిల్ 30 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వర్సిటీల్లో దాదాపు 900 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, అంబేడ్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి సీఎం దృష్టికి తెచ్చారు. వీటి భర్తీకి సీఎం సానుకూలంగా స్పందించారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె భవనాల్లో కొనసాగకూడదని స్పష్టం చేశారు. అన్ని వసతులతో సొంత భవనాలు నిర్మించాలని, బడులు, హాస్టళ్లలో మరుగుదొడ్లు, నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News