Share News

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:26 AM

విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు కట్టుతప్పుతున్నాయి. భవిష్యత్‌ బాగుండాలని రూ.లక్షలు పోసి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
ban on movie promotions in colleges

  • భారీ కార్యక్రమాలు చేపడితే పోలీసు,అగ్నిమాపక శాఖల అనుమతి తప్పనిసరి

  • ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలకు సిద్ధమవుతున్న సర్కారు

హైదరాబాద్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు కట్టుతప్పుతున్నాయి. భవిష్యత్‌ బాగుండాలని రూ.లక్షలు పోసి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు. కానీ కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను తమ రాజకీయ, కుటుంబ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో అనేక అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడమే కాకుండా కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కొన్ని విద్యాసంస్థల్లో చోటుచేసుకున్న పరిణామాలు ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు, విద్యావంతుల్లో ఆందోళన కలిగించాయి. విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారీతిగా సెలవులు ప్రకటించడం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే భారీ కార్యక్రమాలు చేపట్టడం పరిపాటిగా మారింది.


ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో సినిమా, ఇతర ప్రైవేటు కార్యక్రమాల ప్రచారంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యాసంస్థలు చట్టపరంగా వారి క్యాంప్‌సలలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు? ఎటువంటివి నిర్వహించకూడదనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఇటివలే ప్రభుత్వం విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ దిశగా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలను విద్య, క్రీడా కార్యక్రమాలకు మినహా సినిమా, ఇతర వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొననున్నారు. విద్య, క్రీడా కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిలనుకుంటే.. ఎంత మంది హాజరవుతారు? స్టేజీ నిర్మాణం, రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు, తదితర వివరాలను ముందుగానే స్థానిక విద్యాశాఖ అధికారులు పోలీసులు, అగ్నిమాపక శాఖలకు అందజేయాలి. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు వందలాది మందితో నిర్వహించే వాటి విషయంలో మాత్రం విద్యాసంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. లేనిపక్షంలో భారీ జరిమానాలతో పాటు ఇతర చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేయనున్నారు.


ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు..!

కళలు, సంస్కృతి, క్రీడలు, స్టార్టప్‌ ఈవెంట్లు, ఇతర సృజనాత్మకతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలంటూ విద్యాసంస్థలను విద్యాశాఖ ఆదేశించింది. గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానం, యంగ్‌ ఇండియా ఫిల్మ్‌ మేకర్‌ చాలెంజ్‌ వంటి కార్యక్రమాలు విద్యాశాఖ నిర్వహించింది. అదే సమయంలో కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు అందుకు భిన్నంగా తాము సూచించిన సినిమాలు చూడాలని, ఆ సినిమా చూసేందుకు సెలవులు సైతం ప్రకటించాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇటీవల ఒక విద్యాసంస్థలో వేదిక కూలి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మార్గదర్శకాలు విడుదల చేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పంట రుణాలపై మారటోరియం

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా రావాల్సిందే..

సినీ నిర్మాతలకు ఐడీ చిక్కులు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 04:26 AM