Share News

పంట రుణాలపై మారటోరియం

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:03 AM

ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంట రుణాల వసూళ్లపై ఏడాదిపాటు మారటోరియం విధించాలని బ్యాంకులు నిర్ణయించాయి. దీని ప్రకారం ప్రాథమికంగా రుణాల వసూళ్లను ఏడాదిపాటు నిలిపివేయనున్నారు.

పంట రుణాలపై మారటోరియం
Bhatti Vikramarka

  • ప్రాథమికంగా ఏడాదిపాటు వసూళ్ల నిలిపివేత

  • తీవ్ర కరువు మండలాల్లో ఐదేళ్ల లోపు

  • మధ్యస్థ మండలాల్లో మూడేళ్లలోపు వసూలు

  • రైతులకు అవసరాన్ని బట్టి అదనపు రుణాలు

  • మహిళా సంఘాలు, ఇతర రుణాల రీషెడ్యూల్‌

  • రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయాలు

  • ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్న బ్యాంకర్లు

  • లక్ష్యంలో 50 శాతం పంట రుణాలేనంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల అసంతృప్తి

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంట రుణాల వసూళ్లపై ఏడాదిపాటు మారటోరియం విధించాలని బ్యాంకులు నిర్ణయించాయి. దీని ప్రకారం ప్రాథమికంగా రుణాల వసూళ్లను ఏడాదిపాటు నిలిపివేయనున్నారు. తీవ్ర కరువు మండలాల్లో ఐదేళ్లలోపు, మధ్యస్థ కరువు మండలాల్లో మూడేళ్లలోపు తిరిగి పంట రుణాలను వసూలు చేసుకుంటాయి. అయితే.. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే రీషెడ్యూలు, రీస్ట్రక్చరింగ్‌ ప్రక్రియలు ఉంటాయని పేర్కొన్నాయి. ఈ మేరకు కరువు మండలాల్లో ప్రభావితమైన రుణ గ్రహీతలను గుర్తించనున్నారు. వీటితోపాటు మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలు, ఇతర రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని నిర్ణయించారు.


మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్‌ఎల్‌బీసీ సభ్య భ్యాంకుల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పంట రుణాలను రీషెడ్యూల్‌, రీస్ట్రక్చరింగ్‌ చేయాలని మంత్రులు బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో 111 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా, 254 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. దీంతో తీవ్ర కరువు, మధ్యస్థ కరువు మండలాల్లో ఏడాదిపాటు మారటోరియం విధించడానికి బ్యాంకులుఅంగీకరించాయి.


మారటోరియం వ్యవధిని కలుపుకొని తీవ్ర కరువు మండలాల్లో 60 నెలలు (ఐదేళ్లు), మధ్యస్థ మండలాల్లో 36 నెలల (మూడేళ్లు) లోపు రుణాల వసూళ్లను చేపట్టాలని బ్యాంకర్లు ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. రుణ గ్రహీతలు (రైతులు) ఈ రెండు ఆప్షన్లలో దేనినైనా ఎంచుకునే వీలు కల్పించనున్నారు. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన అక్టోబరు 24వ తేదీ నుంచి 135 రోజుల్లోగా రైతులు ఈ ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రైతుల అవసరాన్ని బట్టి అదనపు పంట రుణాలను కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రుణాల రీస్ట్రక్చరింగ్‌, అదనపు రుణాల అందజేత కోసం ఒక సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి ఎస్‌ఎల్‌బీసీకి సిఫారసులు చేయనుంది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతుల వడ్డీ భారాన్ని తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం అంగీకరిస్తే.. వడ్డీ భారాన్ని తగ్గించడం, సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను వర్తింపజేయడం వంటి చర్యలు చేపట్టవచ్చని తెలిపాయి. పంట బీమా సొమ్ము అందితే... దానిని రైతుల రుణ అకౌంట్లలో సర్దుబాటు చేస్తామని చెప్పాయి.


వ్యవసాయ రుణాలు 53.55 శాతమే..

ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు వ్యవసాయ రంగానికి అందిస్తామన్న రుణాల్లో 53.55 శాతం రుణాలను మాత్రమే అందించాయి. ఖరీఫ్‌, రబీ పంటలకు కలిపి వ్యవసాయ రుణాలు, మౌలిక సదుపాయాల రుణాలు, ఇతర అనుబంధ రంగాల రుణాలన్నింటి కింద మొత్తం రూ.1,81,035 కోట్ల మేర రుణాలు అందిస్తామని బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళికను ప్రకించాయి. కానీ, ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు 30 వరకు మొత్తం ఆరు నెలల కాలంలో రూ.96,943 కోట్ల మేర రుణాలను మాత్రమే అందించాయి. అంటే.. ఇది లక్షిత రుణాల్లో 53.55 శాతం. ఈసారి వ్యవసాయంతో కలిపి పరిశ్రమలు ఇతర రంగాలన్నింటికీ మొత్తం రూ.2,31,393 కోట్ల మేర రుణాలు అందిస్తామని చెప్పాయి. ఇందులో 53.31 శాతం మేర రుణాలను పంపిణీ చేశాయి. 50 శాతం రుణాలు మాత్రమే అందించడంపై డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇంకా ఎక్కువ రుణాలను అందిస్తే బాగుండేదన్నారు.


బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు రైతులకు అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రబీ సీజన్‌కు అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా రుణాలు, మార్కెట్‌ మద్దతు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించేందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. దీంతోపాటు అర్హులైన విద్యార్థులకు గరిష్ఠ స్థాయిలో విద్యా రుణాలు అందించాలని, వ్యక్తిగత గృహ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.


సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎ్‌సఎంఈ), మౌలిక సదుపాయాల రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేసేందుకు చర్యలు చేపడుతోందని, ఈ నెల 19 నాటికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌కు బ్యాంకులు నిర్దేశించుకున్న రూ.38,268 కోట్ల పంట రుణాలను బ్యాంకులు వెంటనే మంజూరు చేయాలన్నారు. ఈ. సమావేశంలో ఆర్థిక శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, ప్రణాళిక శాఖల ముఖ్యకార్యదర్శులు సందీ్‌పకుమార్‌ సుల్తానియా, రాహుల్‌ బొజ్జా, గౌరవ్‌ ఉప్పల్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్‌, బ్యాంకు అధికారులు నీలేశ్‌ ద్వివేది, మానస గంగోత్రి, చిన్మయ్‌కుమార్‌, ఉదయ్‌ భాస్కర్‌, సురే్‌షకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖర్గే Vs బీజేపీ .. దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం

క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. 679 బ్రాండ్ల ధరల తగ్గింపు

ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 04:05 AM