కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా రావాల్సిందే..
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:09 AM
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించాలని.. ఇందుకోసం సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఏపీతో వివాదమున్న అన్ని అంశాలపై పక్కా ఆధారాలు సిద్ధం చేయండి
సుప్రీంకోర్టు, కృష్ణా ట్రైబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపించాలి
అధికారులకు సీఎం రేవంత్ నిర్దేశం
డిండి, అచ్చంపేట పనులు వేగవంతం చేయాలని సూచన
కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల్లో గ్రత్తగా వ్యవహరించాలని ఆదేశం
హైదరాబాద్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించాలని.. ఇందుకోసం సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రాల వారీగా నీటి పంపిణీపై సెక్షన్-3ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ దాఖలు చేసిన కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని సూచించారు. ఏపీతో వివాదం ఉన్న అన్ని అంశాలపై అవసరమైన పక్కా ఆధారాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి ట్రైబ్యునల్‌లో కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరుగుతున్నందున తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలని స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పిదం చోటుచేసుకోకుండా ముందుకెళ్లాలని సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి.. కాళేశ్వరం అదనపు టీఎంసీతో పాటు డిండి ఎత్తిపోతల పథకం, కృష్ణా జలాల కేసులపై న్యాయ నిపుణులు, అధికారులతో సీఎం చర్చించారు.
దీనికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఈఎన్‌సీ (జనరల్) రమే్‌షబాబు, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) మధుసూదన్‌రావు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివా్‌సతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉన్నందున.. అదనపు టీఎంసీ పనుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. కేంద్ర జల వనరుల సంఘం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్థం చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి సమాంతరంగా కెనాల్ తవ్వి... ఆ కెనాల్ ద్వారా డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలకు 0.6 టీఎంసీల నీటిని అందించే చర్యలను వేగవంతం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఇందుకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
మీ వల్లే మియాపూర్ భూములు దక్కాయి
మియాపూర్‌లో 500 ఎకరాల భూముల విషయంలో బలమైన వాదనలు వినిపించి.. అవి తెలంగాణ ప్రభుత్వానికి దక్కేలా చేయడంలో కీలక పాత్ర పోషించారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను సీఎం ఈ సందర్భంగా అభినందించారు. అదే స్ఫూర్తితో కృష్ణా జలాల్లో సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్‌లో వాదనలు వినిపించి.. తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చూడాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. 679 బ్రాండ్ల ధరల తగ్గింపు
ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News