Share News

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:01 AM

మహిళలను ఎక్కువగా వేధిస్తున్న క్యాన్సర్లలో మొదటిది రొమ్ము క్యాన్సర్‌. గుర్తించే సమయానికే రొమ్ము క్యాన్సర్‌ ఇతర అవయవాలకు వ్యాపిస్తోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని ఐసీఎంఆర్‌ తాజా అధ్యయనం పేర్కొంది.

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!
Breast Cancer India

  • పెరుగుతున్న మెటాస్టాటిక్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు..

  • రొమ్ము క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించడమే కారణం

  • దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు

హైదరాబాద్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మహిళలను ఎక్కువగా వేధిస్తున్న క్యాన్సర్లలో మొదటిది రొమ్ము క్యాన్సర్‌. గుర్తించే సమయానికే రొమ్ము క్యాన్సర్‌ ఇతర అవయవాలకు వ్యాపిస్తోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని ఐసీఎంఆర్‌ తాజా అధ్యయనం పేర్కొంది. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే నయమయ్యే అవకాశం ఉన్నా చాలామంది మంది మహిళలు వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రులకు వస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 76,356మంది బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బాధితుల వివరాలను విశ్లేషించగా.. వారిలో 12.96 శాతం మంది అంటే దాదాపు ప్రతి 8 మందిలో ఒకరు క్యాన్సర్‌ ఇతర అవయవాలకు వ్యాపించిన (మెటాస్టాటిక్‌) దశలోనే తొలిసారి ఆసుపత్రికి వచ్చినట్లు తేలింది.


వీరిలో ఎక్కువ మందికి ఎముకలకు క్యాన్సర్‌ వ్యాపించినట్లు గుర్తించారు. ఐసీఎంఆర్‌- ఎన్‌ఐఎన్‌ఈ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌-సౌత్‌ఈస్ట్‌ ఏషియా జర్నల్‌లో ప్రచురితమైంది. 2009 నుంచి 2020 వరకు దేశంలోని 71 ఆసుపత్రుల క్యాన్సర్‌ రిజిస్ట్రీల్లో నమోదైన మహిళల వివరాలను పరిశోధకులు పరిశీలించారు. వ్యాధి ఏ దశలో బయటపడుతోంది, ఏ అంశాలు క్యాన్సర్‌ ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదాన్ని పెంచుతున్నాయి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలున్నాయి? వంటి అంశాలను విశ్లేషించారు.


ప్రతి 8 మందిలో ఒకరికి మెటాస్టాటిక్‌!

మొత్తం 76,356 మంది మహిళల్లో 9,893 మందికి క్యాన్సర్‌ ఇతర అవయవాలకు వ్యాపించినట్లు గుర్తించారు. అంటే 12.96 శాతం మంది మెటాస్టాటిక్‌ దశలో ఉన్నారు. వైద్య పరిభాషలో దీన్ని స్టేజ్‌-4 వ్యవహరిస్తారు. రొమ్ములో మొదలైన క్యాన్సర్‌ కణాలు రక్తప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ మందికి (2,487మందికి - 25.1 శాతం) ఎముకలకు వ్యాపించింది. ఎముకలతో పాటు ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు కూడా రొమ్ములో మొదలైన క్యాన్సర్‌ వ్యాపిస్తోంది. ఇతర అవయవాలకు వ్యాపించి, సంక్లిష్టంగా మారకముందే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం అత్యంత కీలకమని అధ్యయనం పేర్కొంది.


కణితి పరిమాణం పెరిగితే ముప్పు ఎక్కువ

కణితి పరిమాణానికి, క్యాన్సర్‌ వ్యాప్తికి మధ్య సంబంధం కూడా కీలకాంశంగా అధ్యయనం వెల్లడించింది. రొమ్ములో ఏర్పడిన కణితి పరిమాణం పెరిగే కొద్దీ ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. 2 సెంటీమీటర్ల కంటే చిన్న కణితులతో పోలిస్తే 3 నుంచి 20 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న కణితుల వల్ల మెటాస్టాటిక్‌కు దారి తీసే ప్రమాద ప్రమాద నిష్పత్తి పెరుగుతూ వచ్చింది. దీన్ని బట్టి వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంత ముఖ్యమో అధ్యయనం చెబుతోంది. 2015 తర్వాత ఈ కేసుల సంఖ్య పెరిగినట్టు అధ్యయనంలో గుర్తించారు.


ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ కేసులు

మొత్తం 76,356 మంది బాధితుల్లో 56,844 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఇది 74.4శాతం. అయితే ఈ గణాంకాలతో పభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స నాణ్యత తక్కువగా ఉందని లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో మెరుగ్గా ఉందని నిర్ధారించలేమని అధ్యయనం పేర్కొంది. రోగులు ఆసుపత్రులకు చేరే సమయం, రిఫరల్‌ విధానం, వ్యాధి నిర్ధారణ పరీక్షల లభ్యత, రోగుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ఈ వ్యత్యాసాలకు కారణమై ఉండవచ్చని పరిశోధకులు విశ్లేషించారు. మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ బాధితుల్లో 46 ఏళ్లు పైబడిన మహిళలే 65 శాతం మంది ఉన్నారు.


దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు

మొత్తం కేసుల్లో 37,162 మంది (48.6 శాతం) దక్షిణాదికి చెందినవారు. ‘ఇది దక్షిణాది రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగుల ప్రాతినిధ్యం మాత్రమే. దక్షిణాదిలో క్యాన్సర్‌ వ్యాప్తి దేశంలోనే అత్యధికమని దీన్ని బట్టి నిర్ధారించలేమ’ని అధ్యయనం పేర్కొంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ విషయంలో ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని స్పష్టం చేసింది. రొమ్ములో కొత్త గడ్డ, ఆకారం లేదా పరిమాణంలో, చర్మంలో మార్పులు, చనుమొన నుంచి అసాధారణ స్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించింది.

వివిధ ఆస్పత్రుల రిజిస్ట్రీల్లో నమోదైన రొమ్ము క్యాన్సర్‌ బాధితులు 76,356

ఆసుపత్రులు 71

అధ్యయన కాలం 2009-2020

మెటాస్టాటిక్‌ కేసుల సంఖ్య, శాతం 9,893 (12.96 శాతం)

ఎముకలకు వ్యాప్తి చెందినవారు 2,487


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

గ్రూప్‌-1 ఆఫీసర్లుగా ఉపాధి కూలీ పిల్లలు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 05:02 AM