Share News

గ్రూప్‌-1 ఆఫీసర్లుగా ఉపాధి కూలీ పిల్లలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:35 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ద్వారా తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

గ్రూప్‌-1 ఆఫీసర్లుగా ఉపాధి కూలీ పిల్లలు
Revanth Reddy

  • టీజీపీఎస్సీ నియామకాల్లో మా పారదర్శకతకు ఇదే నిదర్శనం..

  • గతంలో కమిషన్‌ను పునరావాస కేంద్రంగా మార్చారు

  • మేం రాగానే ప్రక్షాళన చేయాలని ముందే నిర్ణయించాం

  • బెల్టు లూజ్‌ అయినా పర్వాలేదు.. ట్‌ కానివ్వకండి

  • వచ్చే ముప్పై ఏళ్లు తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లోనే

  • ప్రస్తుతం నేరాల ప్రవృత్తి పూర్తిగా మారిపోయింది

  • ముఖ పరిచయం లేకుండానే సర్వం దోచుకునే పరిస్థితి లాంటి వాటిని అరికట్టే సత్తా ఉండాలి

  • ప్రొబేషనరీ డీఎస్పీలతో ముఖాముఖిలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ద్వారా తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తే 562 మంది జాయిన్‌ అయ్యారని, వారిలో 112 మందిని డీఎస్పీలుగా నియమించడం చాలా పెద్ద విషయమని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి పిల్లలు కూడా ఈ నియామకాల్లో ఉండడం తమ పారదర్శకతకు నిదర్శనమన్నారు. కొందరు పని గట్టుకుని అవినీతి జరిగిందని, కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారని ఆక్షేపించారు. రాజకీయ ఆరోపణలు తమకు కొత్త కాకపోయినా.. పరీక్ష రాసిన అభ్యర్థులకు అవి చాలా ఆందోళన కలిగించాయని చెప్పారు.


వారి తరఫున ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లి విజయం సాధించిందని గుర్తు చేశారు. మంగళవారం ఎంసీహెచ్‌ఆర్డీలో ప్రొబేషనరీ డీఎస్పీలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో సీఎం మాట్లాడారు. టీజీపీఎస్సీని గతంలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆరోపించారు. కమిషన్‌లో గతంలో సభ్యులుగా పనిచేసిన వారిలో ఆర్‌ఎంపీ డాక్టర్ల లాంటి వాళ్లు ఉన్నారని, ఉన్నత స్థాయిలో నియామకాలు చేపట్టే టీజీపీఎస్సీ బోర్డులో అంతకంటే కింది స్థాయి వాళ్లను, అవగాహన లేని వాళ్లను సభ్యులుగా నియమించడం ప్రభుత్వం తప్పు అని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా కాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆ మేరకే యూపీఎస్సీ తీసుకుంటున్న విధానాలను అధ్యయనం చేసి టీజీపీఎస్సీని ఆ తరహాలో రూపొందించామని చెప్పారు.


నేరాల ప్రవృత్తి మారిపోయింది..

కొత్తగా సర్వీ్‌సలోకి వస్తున్న డీఎస్పీలకు బెల్టు లూజ్‌ అయినా పర్వాలేదు కానీ.. టైట్‌ కాకుండా సిక్స్‌ప్యాక్‌ దేహధారుడ్యం కలిగి ఉండాలని సీఎం రేవంత్‌ సూచించారు. ‘‘ప్రస్తుతం నేరాల ప్రవృత్తి మారిపోయింది. మన మొబైల్‌లోకి చొరబడి సైబర్‌ నేరగాళ్లు మనకు తెలియకుండానే సర్వం దోచుకునేంత సాంకేతికత వృద్ధి చెందింది. వ్యక్తుల మధ్య ముఖ పరిచయం లేకుండా దోచుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి నేరాలను ఎదుర్కొనే సత్తా ఉండాలి. వచ్చే ముప్పై ఏళ్లు తెలంగాణ భవిష్యత్తును ఏ దిశగా నడిపించాలో మీ చేతుల్లోనే ఉంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే పెద్ద హోదా మీది. మీ ఫీడ్‌బ్యాక్‌, నిర్ణయాలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారుతాయి’ అని సీఎం అన్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ డీఎస్పీలకు ముఖ్యమంత్రి చేతులమీదుగా అవార్డులు అందజేశారు. అనంతరం క్రైమ్‌ సీన్స్‌ ఫోరెన్సిక్‌ హ్యాండ్‌బుక్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు శివధర్‌ రెడ్డి, ఎంసీహెచ్‌ఆర్‌డీ వైస్‌ చైర్‌పర్సన్‌ శాంతకుమారి, డీజీపీ సీవీ ఆనంద్‌, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా రావాల్సిందే..

సినీ నిర్మాతలకు ఐడీ చిక్కులు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 04:35 AM