Share News

హైడ్రా రంగనాథ్‌ను హాజరుపరచండి

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:34 AM

ఓ కోర్టు ధిక్కరణ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను తమ ఎదుట హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

హైడ్రా రంగనాథ్‌ను హాజరుపరచండి
HYDRAA Commissioner AV Ranganath

  • ఓ కోర్టు ధిక్కరణ కేసులో డీజీపీకి హైకోర్టు ఆదేశాలు

  • మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత

  • కారణాలు సహేతుకంగా లేవని ఆక్షేపణ..

  • 17న రావాలన్న కోర్టు

  • మరో కోర్టు ధిక్కరణ కేసులో మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌ను హాజరుపరచాలంటూ కమిషనర్‌కు ఆదేశం

హైదరాబాద్‌, మేడ్చల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఓ కోర్టు ధిక్కరణ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను తమ ఎదుట హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో శంషాబాద్‌ తహసీల్దార్‌ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీసులను ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఈ ఇద్దరు అధికారులు దాఖలు చేసిన దరఖాస్తులను జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం బుధవారం కొట్టేసింది. మినహాయింపు కోసం వారు చెప్పిన కారణాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల కేంద్రంలోని సర్వే నెంబర్‌ 626/2ఏఏలో తమ భూమిలో ఉన్న నిర్మాణాలను కూల్చేసి, ఆ భూమిని బలవంతంగా లాక్కున్నారని పేర్కొంటూ హైదరాబాద్‌ జహానుమా ప్రాంతానికి చెందిన తాజమలుద్దీన్‌ అలియాస్‌ మొయినుద్దీన్‌ఖాన్‌ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.


దీనిపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సదరు భూమిని రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1908 సెక్షన్‌ 22ఏ (నిషేధిత జాబితా) నుంచి తొలగించాలని పేర్కొంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు తనకు గతంలో అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఆ దరఖాస్తును, టైటిల్‌ పత్రాలను, ఆధారాలను పరిశీలించి తగిన వివరణతో ఉత్తర్వులు జారీచేయాలని రెవెన్యూ అధికారులను ధర్మాసనం ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ మేరకు 2024లో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైడ్రా కమిషనర్‌, తహసీల్దార్‌ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని.. అక్కడ ఉన్న నిర్మాణాలను, కంచెను కూల్చేశారని తెలియజేశారు. ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయకుండా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఆ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంటూ గత విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్‌, శంషాబాద్‌ తహసీల్దార్‌లకు ఫారం-1 నోటీసు జారీచేసినా వారు నిర్లక్ష్యం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు అధికారులు ఈ నెల 17న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ, సైబరాబాద్‌ పోలీసులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.


ఇప్పటికే పలుమార్లు మినహాయింపు

మరో కోర్టు ధిక్కరణ కేసులో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌ మను చౌదరి వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌కు జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ భూసంస్కరణల చట్టం-1973 ప్రకారం తన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ కోడూరి అర్జున రావు అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు సింగిల్‌ జడ్జి 2025 జూలై 8న మధ్యంతర ఆదేశాలు వెలువరిస్తూ.. వివాదాస్పద భూముల్లో ఎలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని, పిటిషనర్‌ విజ్ఞప్తిని పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది.


అయితే, అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని తెలియజేస్తూ పిటిషనర్‌ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. భూసంస్కరణల ట్రిబ్యునల్‌ అయిన ఆర్డీవోను తీసుకుని వ్యక్తిగతంగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసినప్పటికీ నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలాసార్లు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకున్నారని గుర్తు చేసింది. తాజాగా కలెక్టర్‌ దాఖలు చేసిన మినహాయింపు అప్లికేషన్‌ను డిస్మిస్‌ చేసింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌ తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదాపడింది.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:37 AM