Share News

మూసీ ప్రక్షాళన చేయాల్సిందే

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:51 AM

‘‘మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ఆ నది పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడతాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మూసీ ప్రక్షాళన చేయాల్సిందే
akkineni nagarjuna, revanth reddy

  • ఏ ఒక్కరికీ నష్టం లేకుండా మూసీ పునరుజ్జీవం

  • చెరువుల చెర విడిపిస్తాం.. ఇక తమ్మిడికుంట ఫేమస్‌

  • భవిష్యత్‌ తరాలకు మేలు జరుగుతుందంటే..

  • కొందరికి నష్టం జరిగినా ఓకే: రేవంత్‌ రెడ్డి

  • హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి

  • మూసీ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికీ ఆహ్వానించాలి

  • పనులు పూర్తిచేసే శక్తి దేవుడు మీకివ్వాలి: నాగార్జున

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ఆ నది పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడతాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు రాజకీయాలకతీతంగా సహకరించాలని.. అందరూ ఒకే వేదికపైకి రావాలని ఆయన కోరారు. 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ ప్రక్షాళనలో భాగంగా.. 21 కిలోమీటర్ల మేర పనులకు అన్ని అనుమతులూ వచ్చాయని, త్వరలో పనులు మొదలు పెడతామని ఆయన తెలిపారు. ఐటీ కారిడార్‌లో రూ.20 కోట్లతో హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంటను.. సినీనటుడు అక్కినేని నాగార్జున, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ప్రపంచంలో ఎక్కడైనా నదీ పరీవాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని, అమెరికా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు నదుల తీర ప్రాంతాలను పర్యాటక, ఆర్థిక చోదక శక్తులుగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.


అదే తరహాలో హైదరాబాద్‌, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలన్నదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. ‘నా సంకల్పం మంచిదైనప్పుడు.. నేను చేసే పని భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడుతున్నప్పుడు. కొందరికి నష్టం జరుగుతుందని ఎందుకు వెనక్కి తగ్గాలి’ అని ప్రశ్నించారు. ఔటర్‌ లోపల ఉన్న 1.34 కోట్ల మందితోపాటు.. నల్గొండ జిల్లాలోని 30 లక్షల మంది మూసీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరముందని రేవంత్‌ అభిప్రాయపడ్డారు. మెడికల్‌, ఇతర వ్యర్థాల డంపింగ్‌ కేంద్రంగా మూసీ నది మారిందని, ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి ఆ నదిని ప్రజలకు ఉపయుక్తంగా, రాష్ట్ర ఆదాయానికి చోదక శక్తిగా తీర్చిదిద్దుతామఇ చెప్పారు. అలాగే.. హైదరాబాద్‌లో చెరువుల చెర విడిపించాల్సిందేనని, కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించాల్సిందేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


బతుకమ్మకుంట, సున్నం చెరువు, నల్ల చెరువు, ఫాక్స్‌ సాగర్‌, మియాపూర్‌ చెరువు తదితర 20 చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తమ్మిడికుంటను అభివృద్ధి చేయాలని నిర్ణయించినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాలు చిరకాల పరిచయమున్న నాగార్జున, ఇతర మిత్రుల మనసుకు కష్టంగా అనిపించాయని.. సర్కారు నిర్ణయం వల్ల వారికి కొంత నష్టం కూడా జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే, కొందరికి నష్టం జరిగినా.. కొన్ని తరాలకు మంచి జరుగుతుందన్న ఆలోచనతోనే చెరువుల పునరుద్ధరణ, పునరుజ్జీవానినికి శ్రీకారం చుట్టామన్నారు. పెద్ద మనసుతో ఈ విషయాన్ని అర్థం చేసుకొన్న నాగార్జున రెండెకరాల స్థలాన్ని ఉదారంగా ఇచ్చి.. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో హీరో అని నిరూపించుకున్నారన్నారు. ఎక్కడో షూటింగ్‌లో ఉన్న ఆయన.. ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తే.. ప్రత్యేకవిమానంలో వచ్చారని చెప్పారు. నాగార్జున నిజమైన హైదరాబాదీ అని, ప్రకృతి పరిరక్షణకు ఆయన ఎప్పుడూ ముందుంటారని రేవంత్‌ ఆకాంక్షించారు.


వాటితోపాటు..

ఇప్పటి వరకు హైటెక్‌ సిటీ, శిల్పారామం, హైటెక్స్‌ గురించి మాత్రమే మాట్లాడుకున్నారని, మూడింటి మధ్య ఉన్న తమ్మిడికుంట గురించి మాట్లాడేలా దాన్ని అభివృద్ధి చేశామని సీఎం తెలిపారు. ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం కాదు.. వర్క్‌ ఫ్రం తమ్మిడికుంట చేసేలా ఏర్పాట్లు చేయాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, సీఎంసీ కమిషనర్‌ సృజనలకు సూచించారు. ఈ సందర్భంగా రామంతాపూర్‌ పెద్ద చెరువులో గుడిసెలు ఇళ్లు కోల్పోయిన 34 మందికి నాచారం- మల్లాపూర్‌ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు పత్రాలు అందజేశారు.


తమ్మిడికుంట దగ్గర షూటింగ్‌లు చేస్తా: నాగార్జున

‘‘తమ్మిడికుంటను చాలా రోజులుగా చూస్తున్నా.. ఇక్కడి పరిస్థితిని చూస్తే బాధ కలిగేది. కానీ చాలా సుందరంగా చెరువును తీర్చిదిద్దార’’ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు నాగార్జున అన్నారు. తాను ఇప్పుడు డ్యాన్స్‌లు చేయడం లేదు కానీ.. ఇక్కడ షూటింగ్‌లు చేస్తానని పేర్కొన్నారు. చెరువులు, నదులంటే రేవంత్‌రెడ్డికి ఇష్టమని, వాటి పునరుజ్జీవానికి ఆయన తీసుకుంటున్న చర్యలు అద్భుతమని ప్రశంసించారు. నగరం చుట్టూ ఉన్న అన్ని చెరువులనూ ఇదే తరహాలో అభివద్ధి చేయాలని సీఎంను నాగార్జున కోరారు. ‘‘మూసీ నది ప్రారంభోత్సవానికి కూడా నన్ను పిలుస్తారని ఆశిస్తున్నా. ఆ ప్రాజెక్టు పూర్తి చేసే శక్తి సీఎంకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆస్తి పన్ను నంబరు ఉంటేనే.. రిజిస్ట్రేషన్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:51 AM