Share News

ముస్లిం రిజర్వేషన్లను తొలగించేవాడు ఇంకా పుట్టలేదు

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:58 AM

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని, దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగాల్లో లక్షలాది మంది ముస్లింలు లబ్ధి పొందుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

ముస్లిం రిజర్వేషన్లను తొలగించేవాడు ఇంకా పుట్టలేదు
Revanth Reddy

  • దమ్ముంటే గుజరాత్‌లో రద్దు చేసి చూపించాలి

  • తెలంగాణ గల్లీ కారు ఢిల్లీ చేరగానే మోదీ కమలంగా మారిపోతోంది

  • మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని, దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగాల్లో లక్షలాది మంది ముస్లింలు లబ్ధి పొందుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ముస్లింల వెనుకబాటుతనాన్ని గుర్తించి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పార్టీ తెచ్చిన రిజర్వేషన్‌ అని, దీన్ని తొలగించేవాడు ఇంకా పుట్టలేదన్నారు. ‘రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. వారు ముందుగా గుజరాత్‌లో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తొలగించి చూపాల’ని సీఎం సవాల్‌ విసిరారు. ఢిల్లీ నుంచి మోదీ, అమిత్‌ షా ఇక్కడికి బాటసారులుగా వస్తుంటారు.. పోతుంటారని, ఇక్కడ రిజర్వేషన్లు మాత్రం ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు ఢిల్లీ చేరగానే మోదీ కమలంగా మారిపోతోందని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి సీఎం విమర్శించారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతీ ప్రజావ్యతిరేక నిర్ణయానికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోందన్నారు. భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని మైనారిటీ శాఖ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనారిటీ వర్గాలు కూడా ప్రగతి సాధించినప్పుడే దేశం ముందడుగు వేస్తుందన్నారు. మైనారిటీల్లో పేదరికం తొలగించాలన్న ఉద్దేశంతో సచార్‌ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు చెప్పారు. మారుతున్న పరిస్థితుల్లో విద్య ఒక్కటే సరిపోదని, ప్రపంచవ్యాప్తంగా స్కిల్స్‌ ఉన్నవారికే ప్రాధాన్యం దక్కుతోందన్నారు. మైనారిటీ యువకుల్లో స్కిల్స్‌ ఉన్నవారు చాలామంది ఉన్నారన్నారు. పిల్లలను బాగా చదివించాలని, చదువుల పట్ల మక్కువ లేని వారికి స్కిల్స్‌ నేర్పించాలని లేదా క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. క్రికెటర్‌ సిరాజ్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తెచ్చారన్నారు. వారిని ప్రభుత్వం గ్రూప్‌-1 ఆఫీసర్లుగా నియమించి ప్రోత్సహించిందన్నారు.


నైట్‌ ఎకానమీతో ఉపాధి అవకాశాలు

మూసీ రివర్‌ ఫ్రంట్‌ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని సీఎం తెలిపారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ పరిసరాల్లో నైట్‌ ఎకానమీని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ పనులను వచ్చే రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయని తెలిపారు. మీరాలం ట్యాంక్‌ మరో ఏడాదిలో సుందరమైన ప్రదేశంగా రూపుదిద్దుకోబోతోందని చెప్పారు. ‘ఓల్డ్‌ సిటీ కాదు... ఒరిజినల్‌ సిటీని తిరిగి పునరుద్ధరించడం కోసం అడుగులు వేశామ’ని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, వీ హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మూసీ ప్రక్షాళన చేయాల్సిందే

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆస్తి పన్ను నంబరు ఉంటేనే.. రిజిస్ట్రేషన్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:58 AM