Share News

నాల్గో టీ20లో టీమ్ఇండియా ఓటమికి ప్రధాన కారణం అతడే.!

ABN , Publish Date - Oct 15 , 2026 | 07:40 AM

పరుగుల వరద పారిన నాల్గో టీ20లో విండీస్ చేతిలో భారత్ ఓటమి‌పాలైంది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 2-2తో సిరీస్ సమమైంది. ఈ మ్యాచ్‌లో విండీస్ బౌలర్ కీమో పాల్.. కీలక సమయంలో వికెట్లు తీసి భార‌త జట్టు ఓటమికి కారణమయ్యాడు.

నాల్గో టీ20లో టీమ్ఇండియా ఓటమికి ప్రధాన కారణం అతడే.!
Keemo Paul help West Indies level series in 4th T20I

ఇంటర్నెట్ డెస్క్: ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో టీ20లో 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది ఆతిథ్య టీమ్ఇండియా. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో.. కీమో పాల్‌ తన అద్భుత బౌలింగ్‌తో భారత్‌ విజయావకాశాలను దెబ్బతీశాడు. భారీ లక్ష్య ఛేదనలో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియాను కీలక సమయాల్లో వికెట్లు తీసి కట్టడి చేశాడు. 5 వికెట్లతో సత్తాచాటిన పాల్‌.. విండీస్‌ను గెలిపించి సిరీస్‌ను సమం చేయడంలో కీలకపాత్ర పోషించాడు.


శాంసన్‌ జోరుకు బ్రేక్‌!

248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చాడు సంజూ శాంసన్. కేవలం 23 బంతుల్లో 56 పరుగులు చేసి విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో 4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 60 పరుగులు చేసింది భారత్. ఆ సమయంలో 5 ఓవర్లో బంతినందుకున్న పాల్‌.. శాంసన్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌(6)ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అప్పటివరకు ధాటిగా సాగిన భారత ఛేదనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌(16), అభిషేక్‌ శర్మ (29) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. మరోవైపు.. గుడాకేశ్‌ మోటీ ఒకే ఓవర్లో అభిషేక్‌, నమన్‌ ధీర్‌లను ఔట్‌ చేయడంతో భారత్‌ 132 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది.


ఈ దశలో తిలక్‌ వర్మ 43(25 బంతుల్లో), లోకల్ బాయ్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి 41 (20 బంతుల్లో) కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కేవలం 26 బంతుల్లోనే 59 పరుగులు జోడించి భారత్‌లో మరోసారి ఆశలు రేపారు. ముఖ్యంగా నితీశ్.. షమర్‌ జోసెఫ్‌ వేసిన 16వ ఓవర్లో ఫోర్‌, రెండు సిక్సర్లతో 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. అయితే షెఫర్డ్‌.. తిలక్‌ను ఔట్‌ చేసి ఈ పార్ట్‌నర్‌షి‌ప్‌ను విడదీశాడు. ఆ తర్వాత మరోసారి రంగంలోకి దిగిన పాల్‌.. నితీశ్‌తో పాటు ప్రిన్స్‌ యాదవ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. అనంతరం అక్షర్‌ పటేల్‌ను ఔట్‌చేసి.. కెరీర్‌లో రెండోసారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. చివరకు 19.3 ఓవర్లలో 223 పరుగులకు 9 వికెట్లు కోల్పోయాక.. అర్ష్‌దీప్‌ సింగ్‌ గాయంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్‌ ముగిసింది. 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన పాల్‌ మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగా.. హోప్‌ శతకం విండీస్‌కు భారీ స్కోరును అందించింది.


అంతకుముందు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌‌కు చేసిన విండీస్.. కెప్టెన్ హోప్‌ 102*(50 బంతుల్లో), షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌ 49 *(26 బంతుల్లో) మెరుపులతో మూడు వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. హోప్‌ చివరి బంతికి సిక్సర్‌ బాది శతకాన్ని పూర్తి చేయడం విశేషం. హెట్‌మయర్‌ 33(12 బంతుల్లో), పావెల్‌ 24(17 బంతుల్లో) కూడా ధాటిగానే ఆడారు. ఇక.. సిరీస్ నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరులో జరగనుంది.


ఇవీ చదవండి:

సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఓఝా?

మళ్లీ సన్‌రైజర్స్‌ గూటికి నటరాజన్‌

Updated Date - Oct 15 , 2026 | 07:47 AM