Share News

కోహ్లీకి ధోనీలా.. స్మృతికి హర్మన్ అండగా నిలవాలి: బీసీసీఐ

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:47 PM

భారత మహిళల జట్టుకు స్మృతి మంధాన నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కోహ్లీకి ధోనీలా.. స్మృతికి హర్మన్ అండగా నిలవాలి: బీసీసీఐ
Mithun Manhas

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల జట్టుకు స్మృతి మంధాన నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పురుషుల జట్టులో విరాట్ కోహ్లీకి ధోని ఎలా అండగా నిలిచాడో.. అదే విధంగా స్మృతికి హర్మన్ ప్రీత్ అలాగే సహకరించాలని పేర్కొన్నారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నంత మాత్రాన సీనియర్ ప్లేయర్లు జట్టుకు దూరం కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


‘కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించేటప్పుడు కొత్త కెప్టెన్‌కు మార్గనిర్దేశం చేయడానికి సీనియర్ ప్లేయర్ జట్టులో ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఎందుకంటే ఎంత అనుభవం ఉన్నా కెప్టెన్సీ చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. గతంలో సౌరభ్ గంగూలీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఎంఎస్ ధోని నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ధోని కెప్టెన్‌గా ఎదిగే క్రమంలో గంగూలీ అనుభవం ఉపయోగపడింది. ఆ తర్వాత ధోనీ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో కొనసాగుతూ విరాట్‌ కోహ్లీకి మార్గదర్శకత్వం వహించాడు. ఫీల్డింగ్‌ వ్యూహాలు, డీఆర్‌ఎస్‌ నిర్ణయాలు, బౌలర్ల మార్పుల విషయంలో కోహ్లీకి ధోనీ సలహాలు అందించేవాడు. రోహిత్‌ శర్మకు కూడా ఈ అనుభవం ఉపయోగపడింది. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీ బాధ్యతల్లో స్థిరపడేందుకు కోహ్లీ, రోహిత్‌ వంటి సీనియర్లు సహకరిస్తున్నారు. ఇదే తరహా సంప్రదాయం మహిళల జట్టులోనూ కొనసాగాలని బీసీసీఐ భావిస్తోంది.


కొత్త కెప్టెన్‌ స్మృతి మంధానకు హర్మన్‌ప్రీత్‌ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యాచ్‌ సమయంలో క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో కొత్తగా జట్టు పగ్గాలు అందుకున్న ప్లేయర్‌ అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో హర్మన్‌ప్రీత్‌.. స్మృతికి విలువైన ఆస్తిలా ఉపయోగపడుతుంది. జట్టులో సీనియర్లు జూనియర్లకు సహకరిస్తూ ఆడుతుంటే విజయాలు వాటతంటే అవే వస్తాయి’ అని మిథున్ తెలిపారు. అయితే, స్మృతి మంధానను కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి గల నిర్దిష్ట కారణాలపై ఆయన నేరుగా స్పందించకపోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

భారీ స్కోర్లు చేయకపోయినా.. అతడు జట్టుకు అవసరం: పుజారా

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: కెరీర్‌లోనే బెస్ట్.. నాలుగో స్థానానికి దూసుకొచ్చిన శ్రేయస్

Updated Date - Oct 14 , 2026 | 05:47 PM