Share News

భారీ స్కోర్లు చేయకపోయినా.. అతడు జట్టుకు అవసరం: పుజారా

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:05 PM

భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆటతీరుపై వస్తున్న విమర్శలకు మాజీ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేయకపోయినా.. జట్టుకు అవసరమైన విధంగా ఆడుతున్నాడని ఇషాన్‌కు మద్దతుగా నిలిచాడు.

భారీ స్కోర్లు చేయకపోయినా.. అతడు జట్టుకు అవసరం: పుజారా
Cheteshwar Pujara

ఇంటర్నెట్ డెస్క్: భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆటతీరుపై వస్తున్న విమర్శలకు మాజీ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేయకపోయినా.. జట్టుకు అవసరమైన విధంగా ఆడుతున్నాడని ఇషాన్‌కు మద్దతుగా నిలిచాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికి అతడు అందిస్తున్న సహకారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. మరోవైపు ఆల్‌రౌండర్‌ నమన్‌ ధీర్‌ బౌలింగ్‌ సామర్థ్యాన్ని కూడా పుజారా ప్రశంసించాడు. ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను గుర్తించి, పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేయడం అతడి ప్రత్యేకత అని పేర్కొన్నాడు.


‘మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న ఇషాన్‌ కిషన్‌.. భారత జట్టుకు ఏం కావాలో అదే చేస్తున్నాడు. ప్రతిసారీ అతడు భారీ స్కోరు చేస్తాడని ఆశించలేం. ఎందుకంటే టాప్‌ ఆర్డర్‌లో అందరూ దూకుడుగా ఆడే ఆటగాళ్లే ఉన్నారు. జట్టుకు మంచి ఆరంభాన్ని అందించడం, పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం వారి బాధ్యత. ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారీ పవర్‌ప్లేను సమర్థంగా ఉపయోగించుకుంటున్నాడు. ఆ తర్వాత అవసరమైనప్పుడు వేగంగా 30, 40 పరుగులు చేసి జట్టుకు ఉపయోగపడుతున్నాడు’ అని పుజారా వెల్లడించాడు.


నమన్ ధీర్ ప్రత్యేకత అదే!

‘నమన్‌ ధీర్‌కు బంతిపై మంచి నియంత్రణ ఉంది. వికెట్లు ఎలా తీయాలో అతడికి తెలుసు. బ్యాటర్‌ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకుని, అతడిని ఎలా ఔట్‌ చేయాలో ప్రణాళికలు రచిస్తున్నాడు. సాధారణంగా స్టంప్స్‌ మీదుగా బంతులు వేస్తూ బ్యాటర్‌కు షాట్లు ఆడేందుకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా చూస్తాడు. టీ20 ఫార్మాట్‌లో స్పిన్నర్లతో పోలిస్తే నమన్‌ ధీర్‌ బౌలింగ్‌ వేగం తక్కువగా ఉంటుంది. అయితే, అదే అతడికి ఒక ఆయుధంగా మారుతోంది. వేగంలో మార్పులు చేయడంతో పాటు లైన్‌, లెంగ్త్‌ను మార్చుతూ బ్యాటర్లను తప్పిదాలకు ప్రేరేపిస్తున్నాడు’ అని పుజారా వివరించాడు.


ఇవి కూడా చదవండి:

బుమ్రాపైనే ఇంకెన్నాళ్లు ఆధారపడతారు?: క్రిస్ శ్రీకాంత్

అనుమతి లేకుండా జట్టులో పేరు.. ఆ టోర్నీ నిర్వాహకులపై ధావన్ ఫైర్

Updated Date - Oct 14 , 2026 | 05:05 PM