Share News

బుమ్రాపైనే ఇంకెన్నాళ్లు ఆధారపడతారు?: క్రిస్ శ్రీకాంత్

ABN , Publish Date - Oct 14 , 2026 | 03:25 PM

వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ భారీగా పరుగులు సమర్పించుకోవడంపై మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ స్పందించాడు. ఆ మ్యాచ్‌లో కుల్దీప్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని అభిప్రాయపడ్డాడు.

బుమ్రాపైనే ఇంకెన్నాళ్లు ఆధారపడతారు?: క్రిస్ శ్రీకాంత్
Krishnamachari Srikkanth

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ భారీగా పరుగులు సమర్పించుకోవడంపై మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ స్పందించాడు. ఆ మ్యాచ్‌లో కుల్దీప్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని అభిప్రాయపడ్డాడు. రెండో టీ20లో దారుణంగా విఫలమైన అతడికి మూడో మ్యాచ్‌లో అవకాశం దక్కకపోవడాన్ని ప్రస్తావించాడు. యువ పేసర్లు మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌లను ప్రోత్సహించడం మంచి విషయమేనని, అయితే బౌలింగ్‌లో భారత్‌ మరింత మంది ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలని సూచించాడు.


‘మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ బాగా బౌలింగ్‌ చేస్తున్నారు. వారిని ఇంకాస్త పదును పెట్టాలి. అయితే బుమ్రాపైనే భారత్‌ ఎంతకాలం ఆధారపడుతుంది? రెండో మ్యాచ్‌లో కుల్దీప్‌ భారీగా పరుగులు ఇచ్చాడు. దాంతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింది. మూడో మ్యాచ్‌లో అతడు ఎక్కడా కనిపించలేదు. అవకాశం ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. వెస్టిండీస్‌తో రెండో టీ20లో 249 పరుగులు చేసినా భారత్ ఓడింది. వెస్టిండీస్ జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్ పటిష్టంగా ఉంది. భారీ షాట్లు ఆడగల ఆటగాళ్లు ఉన్నారు. కానీ బౌలింగ్‌ విభాగం అంత బలంగా లేదు. బౌలింగ్‌లో రోస్టన్‌ చేజ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అతడిని సరిగ్గా చూసుకుని ఆడాల్సింది. భారత మిడిలార్డర్‌ కూడా ఇటీవల బలహీనంగా కనిపిస్తోంది. అభిషేక్‌ శర్మ పరుగులు చేస్తేనే జట్టు గెలిచే పరిస్థితి ఏర్పడుతోంది. వెస్టిండీస్‌ పేస్‌ బౌలింగ్‌ సాధారణ స్థాయిలోనే ఉంది. అయినప్పటికీ భారత బ్యాటర్లు వికెట్లు చేజార్చుకుంటున్నారు’ అని శ్రీకాంత్ విమర్శించాడు.


ఈ ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. వెస్టిండీస్‌ మాత్రం విజయంతో సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.


ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 14 , 2026 | 03:58 PM