బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!
ABN , Publish Date - Oct 13 , 2026 | 07:03 PM
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో డబ్ల్యూటీసీ పట్టికలో ఆసీస్ తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు ఈ ఓటమితో దక్షిణాఫ్రికా రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ రెండో స్థానానికి ఎగబాకింది.
దక్షిణాఫ్రికాపై విజయంతో ఆస్ట్రేలియా 81.82 శాతం పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 72.22 శాతం పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. తొలి టెస్టులో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా ఖాతాలో 60 శాతం పాయింట్లు మాత్రమే ఉండటంతో మూడో స్థానానికి పరిమితమైంది. బంగ్లాదేశ్ నాలుగు, భారత్ ఐదో స్థానాల్లోనే కొనసాగుతున్నాయి. మిగతా జట్ల స్థానాల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
బవుమా అజేయ ప్రస్థానానికి బ్రేక్!
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టెస్టు కెప్టెన్‌గా తన తొలి ఓటమిని చవిచూశాడు. ఆస్ట్రేలియాతో డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బవుమా సేన 214 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టెస్టు కెప్టెన్‌గా వరుసగా 12 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని బవుమా ప్రస్థానానికి తెరపడింది. గతంలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా తొలి ఓటమిని ఎదుర్కొనే ముందు అత్యధికంగా ఎనిమిది టెస్టుల వరకు ఓటమి లేకుండా సాగిన హషీమ్ ఆమ్లా రికార్డును బవుమా అధిగమించాడు.
హేజిల్‌వుడ్ దెబ్బకు కుప్పకూలిన ప్రొటీస్!
కింగ్స్‌మీడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. 421 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే ఆలౌటైంది. హేజిల్‌వుడ్ 49 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. చివరి నాలుగు వికెట్లను కేవలం 16 బంతుల వ్యవధిలో ఐదు పరుగులకే ఆసీస్ పడగొట్టడం విశేషం. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ మాత్రం ఆసీస్ బౌలర్లను గట్టిగా ఎదుర్కొన్నాడు. దాదాపు ఆరు గంటల పాటు క్రీజులో నిలిచి 75 పరుగులు చేశాడు. అయితే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా విజయంలో మాట్ రెన్షా కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ రాణించి బవుమా వికెట్‌ను పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి