తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:03 PM
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్‌కు బీసీసీఐ భువీని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. భువీ తన పని తాను చేసుకుంటూ పోయాడని.. ఫలితం వెతుక్కుంటూ వచ్చిందని తెలిపాడు.
‘భువనేశ్వర్ కుమార్ తిరిగి భారత జట్టులోకి రావాలని పెద్దగా ఆలోచించి ఉండకపోవచ్చు. దాని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా వేసుకుని ఉండడు. తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. ఆర్సీబీ తరఫున బాగా ఆడటంపైనే శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు అతడికి జాతీయ జట్టులో చోటు దక్కడం.. ఆ విజయానికి లభించిన ప్రతిఫలం. కానీ అతడు ఆ ప్రతిఫలం కోసం వెతుక్కుంటూ వెళ్లలేదు. తన పని తాను చేసుకుంటూ పోయాడు. చివరికి విజయం అతడిని వరించింది’ అని అశ్విన్ వివరించాడు.
వైభవ్ ఓ అద్భుతం..
‘వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు. క్రికెట్ అతడి రక్తంలోనే ఉంది. వైభవ్‌కు గొప్ప భవిష్యత్తు ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే అప్పటివరకు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఆడుతుంటే అతడు తన అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఆ సమయాన్ని ఆస్వాదించాలి. సంజు శాంసన్ స్థిరంగా అవకాశాలు పొందడానికి చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. గతంలో అతడికి పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. కానీ ఒక్కసారి అవకాశాలు రావడం మొదలైతే వరుసగా వచ్చాయి. ఏళ్ల తరబడి దక్కనివి.. ఒకే టీ20 ప్రపంచకప్‌లో అతడికి లభించాయి. ప్రతిభ ఉన్నంత మాత్రాన అవకాశాలు వెంటనే వస్తాయని అనుకోవద్దు. సరైన సమయం వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యం’ అని అశ్విన్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
లింక్డిన్‌లోకి కోహ్లీ ఎంట్రీ.. తొలి పోస్ట్ దేని గురించో తెలుసా?
అరుదైన ఘనత.. ఐదోసారి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా గిల్