లింక్డిన్‌లోకి కోహ్లీ ఎంట్రీ.. తొలి పోస్ట్ దేని గురించో తెలుసా?
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:19 PM
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలిసారిగా ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డిన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి పోస్టులోనే భారత క్రీడా రంగంపై తన విజన్‌ను పంచుకున్నాడు. ఈ మేరకు లింక్డిన్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు.. వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇప్పటికే పలు ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేసిన అతడు.. ప్రస్తుతం స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ అజిలిటాస్‌లో పెట్టుబడిదారుడిగా, వన్8 వరల్డ్ సహ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నాడు. తాజాగా 37 ఏళ్ల వయసులో మరో కొత్త అడుగు వేశాడు. తొలిసారి ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డిన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి పోస్టులోనే భారత క్రీడా రంగంపై తన విజన్‌ను పంచుకున్నాడు. ఈ మేరకు లింక్డిన్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.
‘ప్రతి క్రీడను ఆదరించి, సంబరాలు చేసుకునే భారతదేశాన్ని చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. ఇప్పుడు ఆ కలకు మరింత చేరువయ్యాం. ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే బ్రాండ్లను నిర్మించే సత్తా భారత్‌కు ఉందని కొత్త తరం నిరూపిస్తోంది. భారత్ నుంచి తయారీ, వినియోగదారుల బ్రాండ్లు, క్రీడా ఉత్పత్తుల పంపిణీ వరకు అన్ని విభాగాలను అనుసంధానించే సమగ్ర క్రీడా వేదికను నిర్మించాలన్నదే మా లక్ష్యం. ప్రపంచ క్రీడా రంగంలో భారత్ కేవలం పాల్గొనే దేశంగానే కాకుండా.. దాని భవిష్యత్తును నిర్దేశించే స్థాయికి ఎదగగలదని నమ్ముతున్నా. మా లక్ష్యం స్పష్టంగా ఉంది. మనందరి తర్వాత కూడా నిలిచిపోయే ఒక వ్యవస్థను నిర్మించాల్సిన సమయం వచ్చింది. ఆ దిశగానే మా ప్రయాణం సాగుతోంది’ అని కోహ్లీ తన పోస్టులో పేర్కొన్నాడు.
ఈ లక్ష్యంతోనే అజిలిటాస్‌లో పెట్టుబడిదారుడిగా, వన్8లో సహ వ్యవస్థాపకుడిగా, సృజనాత్మక భాగస్వామిగా చేరినట్లు కోహ్లీ వెల్లడించాడు. తన క్రికెట్ కెరీర్‌లోనూ హద్దులను అధిగమించడం, ప్రమాణాలను పెంచుకోవడం, కొత్తగా ఆలోచించడం వంటి విలువలనే నమ్మానని చెప్పాడు. తన సొంత నగరంలో వేలాది మంది సమక్షంలో వన్8వరల్డ్ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం జీవితంలో మరిచిపోలేని క్షణాల్లో ఒకటని తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి