Share News

అరుదైన ఘనత.. ఐదోసారి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా గిల్

ABN , Publish Date - Oct 13 , 2026 | 02:38 PM

భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కించుకున్నాడు. గిల్‌ ఈ అవార్డు అందుకోవడం ఇది ఐదోసారి.

అరుదైన ఘనత.. ఐదోసారి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా గిల్
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కించుకున్నాడు. గిల్‌ ఈ అవార్డు అందుకోవడం ఇది ఐదోసారి. సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో గిల్ 333 పరుగులు చేశాడు. మరోవైపు మహిళల క్రికెట్‌లో స్టార్ యువ ఓపెనర్ షఫాలీ వర్మను ఈ అవార్డు వరించింది. అటు పురుషులు, ఇటు మహిళల క్రికెట్‌లో భారత క్రికెటర్లే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కించుకోవడం విశేషం.


రికార్డు స్థాయిలో ఐదోసారి..

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్‌ అద్భుతంగా రాణించాడు. తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో 110 పరుగులతో అదరగొట్టిన ఈ స్టార్‌ బ్యాటర్‌.. ఆ తర్వాతి మ్యాచ్‌లో విధ్వంసకర ద్విశతకంతో చెలరేగాడు. కేవలం 133 బంతుల్లోనే 223 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ ప్రదర్శనతో గిల్‌ ఐదోసారి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో 2023 జనవరి, సెప్టెంబర్‌, 2025 ఫిబ్రవరి, జులై నెలల్లోనూ అతడికి ఈ అవార్డు దక్కింది. వెస్టిండీస్‌ మహిళా జట్టు కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ కూడా ఐదుసార్లు ఈ అవార్డును గెలుచుకుంది.


షఫాలీ మరోసారి సత్తా..

మహిళల విభాగంలో షఫాలీ వర్మకు ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డు దక్కింది. ఆసియా కప్‌లో భారత జట్టు టైటిల్‌ గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో 184.61 స్ట్రైక్‌రేట్‌తో 360 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు పడగొట్టింది. ఆసియా క్రీడల్లోనూ షఫాలీ తనదైన ముద్ర వేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో అజేయంగా 100 పరుగులు.. శ్రీలంకతో ఫైనల్లో 48 పరుగులతో రాణించింది. గతేడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేసినందుకు షఫాలీ ఈ అవార్డు అందుకుంది. తాజాగా మరోసారి ఈ అవార్డును సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్

రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి

Updated Date - Oct 13 , 2026 | 02:38 PM