Share News

రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి

ABN , Publish Date - Oct 12 , 2026 | 02:44 PM

దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన రంజీ ట్రోఫీకి ప్రాధాన్యం తగ్గుతోందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. బీసీసీఐ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన రంజీ ట్రోఫీకి ప్రాధాన్యం తగ్గుతోందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలోనే ఇండియా-ఎ జట్టు మ్యాచ్‌లను నిర్వహించడంపై అభ్యంతరం తెలిపాడు. ఇలాంటి షెడ్యూలింగ్ కారణంగా పలువురు ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు దూరమవుతున్నారని పేర్కొన్నాడు. దేశవాళీ టోర్నీలకు ఇబ్బంది కలగకుండా ఇండియా-ఎ మ్యాచ్‌లను నిర్వహించాలని సూచించాడు.


‘రంజీ ట్రోఫీలో ఎలైట్‌ డివిజన్‌ జట్ల మధ్య పోటీ గతంతో పోలిస్తే మెరుగుపడింది. గతంలో అంతగా పోటీనివ్వని జట్లు కూడా ఇప్పుడు రంజీ ట్రోఫీని గెలిచే స్థాయికి ఎదగడం శుభపరిణామం. అయితే భారత అంతర్జాతీయ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువగా ఆడకపోవడంతో వ్యక్తిగతంగా ఆటగాళ్ల అసలు సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు, వికెట్లు తీసిన బౌలర్లు భారత జట్టుకు ఎంపికైన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు జట్టులో చోటు నిలబెట్టుకోలేకపోతుండగా.. మరికొందరు అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంటున్నారు’ అని గావస్కర్ వివరించాడు.


ఇండియా-ఎ మ్యాచ్‌లు అవసరమే.. కానీ!

‘అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగల ఆటగాళ్లను గుర్తించేందుకు ఇండియా-ఎ మ్యాచ్‌లు ఉపయోగపడతాయి. అయితే వాటి కోసం రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీలను పక్కన పెట్టకూడదు. బలహీనమైన ప్రత్యర్థులతో ఆడటం వల్ల బ్యాటర్లు భారీగా పరుగులు చేయడం, బౌలర్లు పెద్ద సంఖ్యలో వికెట్లు సాధించడం సులభమవుతుంది. దేశవాళీ క్రికెట్‌లో పోటీ స్థాయి తగ్గితే ఒకే సీజన్‌లో బ్యాటర్‌ 2,000 పరుగులు, బౌలర్‌ 100 వికెట్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు’ అని గావస్కర్ పేర్కొన్నాడు.


కొత్త జట్లతో ప్రమాణాలు తగ్గాయా?

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రంజీ ట్రోఫీలో చోటు కల్పించడంపైనా గావస్కర్‌ ప్రశ్నలు లేవనెత్తాడు. ‘కొత్తగా ఏర్పాటైన కొన్ని జట్లకు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో అవకాశాలు దక్కని ఆటగాళ్లను తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఆటగాళ్లలో ప్రతిభ ఉన్నప్పటికీ, ఎలైట్‌ డివిజన్‌ జట్లతో తలపడినప్పుడు స్థాయిలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్లేట్‌ డివిజన్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ రికార్డులు నమోదవుతున్నా.. వాటిని ఎలైట్‌ డివిజన్‌ ప్రదర్శనలతో సమానంగా చూడలేం. రంజీ ట్రోఫీకి మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, ఇండియా-ఏ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను దేశవాళీ క్రికెట్‌కు ఇబ్బంది కలగకుండా రూపొందించాలి’ అని బీసీసీఐకి గావస్కర్‌ సూచించాడు.


ఇవి కూడా చదవండి:

విండీస్‌తో మూడో టీ20: టాస్ ఓడిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్లు!

టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు

Updated Date - Oct 12 , 2026 | 02:45 PM