Share News

అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్

ABN , Publish Date - Oct 12 , 2026 | 03:37 PM

భారత స్టార్ బ్యాటర్ అభిషేక్‌ శర్మపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. వివిధ పరిస్థితుల్లో ఎలాంటి బౌలింగ్‌నైనా సులువుగా ఎదుర్కొంటూ నిలకడగా పరుగులు చేస్తున్నాడని తెలిపాడు.

అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
Dinesh Karthik

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు. కేవలం 30 బంతుల్లో 69 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అభిషేక్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. వివిధ పరిస్థితుల్లో ఎలాంటి బౌలింగ్‌నైనా సులువుగా ఎదుర్కొంటూ నిలకడగా పరుగులు చేస్తున్నాడని తెలిపాడు. ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా ఎదిగాడని అభిప్రాయపడ్డాడు.


‘అభిషేక్ శర్మ ఆటతీరులో వచ్చిన మార్పులకు దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ మార్గదర్శకత్వం కూడా ఒక కారణం. ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించుకోవాలి? ఎప్పుడు దూకుడుగా ఆడాలి? అనే విషయాల్లో అభిషేక్ మంచి పరిణతి సాధించాడు. పవర్ ప్లేలో వీలైనన్ని బౌండరీలు సాధిస్తూనే.. పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకుంటున్నాడు. ప్రపంచంలోని వివిధ పిచ్‌లపై, భిన్నమైన బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతున్నాడు. అభిషేక్ శర్మ వికెట్ తీస్తే సగం మ్యాచ్ గెలిచేసినట్టు ప్రత్యర్థి జట్లు భావిస్తాయి. ఆరంభంలోనే అతడిని ఔట్‌ చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బౌలర్లకు తెలుసు’ అని దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానించాడు.


టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడటం ఒక ఎత్తయితే.. అదే దూకుడును ప్రతి మ్యాచ్‌లోనూ కొనసాగించడం మరో ఎత్తు. ఈ విషయంలో అభిషేక్‌ ప్రత్యేకత చాటుకుంటున్నాడని కార్తీక్‌ అభిప్రాయపడ్డాడు. ‘అభిషేక్ బలమైన ప్రత్యర్థులపై, కీలక మ్యాచ్‌ల్లోనూ పరుగులు సాధిస్తూ తన నిలకడను నిరూపించుకుంటున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అవసరమైనప్పుడు పరిస్థితులను అర్థం చేసుకొని ఆడటం అతడిని ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో ఒకరిగా నిలబెడుతోంది’ అని దినేశ్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి

టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు

Updated Date - Oct 12 , 2026 | 03:37 PM