అనుమతి లేకుండా జట్టులో పేరు.. ఆ టోర్నీ నిర్వాహకులపై ధావన్ ఫైర్
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:36 PM
వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్లో అనధికారంగా తన పేరును వాడుకోవడంపై భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్లో అనధికారంగా తన పేరును వాడుకోవడంపై భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అనుమతి లేకుండా ఆటగాళ్ల జాబితాలో తన పేరును చేర్చడంపై తీవ్రంగా స్పందించాడు. టోర్నీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు ధావన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
‘వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో నా పేరు కూడా ఉన్నట్లు గుర్తించా. నాకు తెలియకుండా, నా అనుమతే తీసుకోకుండా టోర్నీ నిర్వాహకులు ఈ పని చేశారు. దీనిపై మా లీగలు టీమ్ చర్యలు తీసుకుంటుంది. అధికారికంగా ధ్రువీకరించని ప్రకటనలను ప్రచారం చేయొద్దని మీడియా, అభిమానులను కోరుతున్నా’ అని ధావన్ పేర్కొన్నాడు.
ఈ టోర్నీలో ఆసియా వారియర్స్ తరఫున ధావన్ ఆడనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ జట్టులో పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే, ఈ టోర్నీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ధావన్ స్పష్టం చేశాడు. అతడితో పాటు భారత మాజీ క్రికెటర్లు రాహుల్ శర్మ, గుర్కీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్ పేర్లను కూడా ఆసియా వారియర్స్ జట్టులో చేర్చారు. ఇప్పుడు ధావన్ పోస్టుతో దీనిపై నిర్వాహకులు మరో ప్రకటన చేశారు. షెడ్యూల్ సమస్యలు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ టోర్నీలో ధావన్ ఆడటం లేదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!
ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన