Share News

ఐపీఎల్‌లోకి యువరాజ్ సింగ్ ఎంట్రీ.. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా..!

ABN , Publish Date - Oct 13 , 2026 | 09:37 PM

భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అసిస్టెంట్ కోచ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఐపీఎల్‌లోకి యువరాజ్ సింగ్ ఎంట్రీ.. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా..!
Yuvraj Singh

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అసిస్టెంట్ కోచ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. యువీకి ఇదే తొలి అధికారిక కోచింగ్ నియామకం కావడం విశేషం. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. జట్టు నూతన హెడ్‌ కోచ్‌ సౌరభ్‌ గంగూలీతో కలిసి యువరాజ్‌ పనిచేయనున్నాడు.


భారత క్రికెట్‌లో ఒకప్పుడు కీలక ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన గంగూలీ, యువరాజ్‌ ఇప్పుడు కోచ్‌లుగా కలిసి పనిచేయనున్నారు. ఈ కొత్త బాధ్యతపై యువరాజ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఫ్రాంచైజీతో నాకు గతంలోనూ అనుబంధం ఉంది. అందుకే ఈ అవకాశం నాకు మరింత ప్రత్యేకం. ఈసారి దాదాతో కలిసి ప్లేయర్‌గా కాకుండా కోచ్‌గా పనిచేయబోతున్నా. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషిస్తానని నమ్ముతున్నా’ అని యువరాజ్‌ పేర్కొన్నాడు.


పులిలా పోరాడాలి: గంగూలీ

యువరాజ్‌ను కోచ్‌గా ప్రకటిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌ విడుదల చేసిన వీడియోలో హెడ్‌ కోచ్‌ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పులి అంటే కేవలం విజయాలతోనే గుర్తింపు తెచ్చుకునేది కాదు. అది నాయకత్వం వహిస్తుంది. స్ఫూర్తినిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా.. నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోదు’ అని గంగూలీ పేర్కొన్నాడు.


ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. 2020లో ఫైనల్‌కు చేరడమే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. 2025, 2026 సీజన్లలో హెడ్‌ కోచ్‌ హేమాంగ్‌ బదానీ, క్రికెట్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ రావు, బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో ఆడినప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది. ఈ నేపథ్యంలో జట్టును పటిష్ఠం చేసేందుకు ఢిల్లీ యాజమాన్యం కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 13 , 2026 | 09:37 PM