Share News

ఐపీఎల్ 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

ABN , Publish Date - Oct 13 , 2026 | 08:35 PM

ఐపీఎల్ 2027లో జట్టు పగ్గాలను తిరిగి రోహిత్‌ శర్మకు అప్పగించాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు అందించిన తమ కెప్టెన్‌ను మళ్లీ తీసుకొచ్చి.. జట్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ?
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027లో జట్టు పగ్గాలను తిరిగి రోహిత్‌ శర్మకు అప్పగించాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు అందించిన తమ కెప్టెన్‌ను మళ్లీ తీసుకొచ్చి.. జట్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ముంబై ఇండియన్స్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.


రోహిత్‌ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2024 సీజన్‌కు ముందు హార్దిక్‌ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్న తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ హార్దిక్‌ కెప్టెన్సీలో తొలి సీజన్‌లో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. 2025లో ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ.. టైటిల్ మాత్రం‌ గెలవలేకపోయింది. దీంతో వచ్చే సీజన్‌కు నాయకత్వంలో మార్పు ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజా నివేదికల ప్రకారం రోహిత్‌ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.


హార్దిక్‌ పాండ్య పరిస్థితి ఏంటి?

రోహిత్‌కు తిరిగి కెప్టెన్సీ అప్పగిస్తారనే ప్రచారంతో హార్దిక్‌ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. అతడిని వేరే ఫ్రాంచైజీకి ట్రేడ్‌ చేసే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ పేర్లు కూడా వినిపించాయి. హార్దిక్‌ ట్రేడ్‌ విషయంలో ముంబై, రాజస్థాన్‌ మధ్య చర్చలు జరిగినట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యవహారంలో స్పష్టత రాలేదు. హార్దిక్‌ ముంబైని వీడితే సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ కెప్టెన్సీ రేసులో ఉండొచ్చనే చర్చ కూడా గతంలో జరిగింది. హార్దిక్‌ అందుబాటులో లేని సందర్భాల్లో సూర్యకుమార్‌ ముంబైకి నాయకత్వం వహించాడు. భారత టీ20 జట్టుకు కూడా అతడు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది.


ఐపీఎల్‌ 2027 రోహిత్‌కు చివరి సీజనా?

2027 ఐపీఎల్‌ సీజన్‌లో రోహిత్‌ 40 ఏళ్లకు చేరువలో ఉంటాడు. అదే ఏడాది వన్డే ప్రపంచకప్‌ కూడా జరగనుంది. దీంతో ఐపీఎల్‌లో అతడి భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. 2027 సీజన్‌ తర్వాత కూడా ఆడతాడా? లేక అదే చివరిదవుతుందా? అనే చర్చ మొదలైంది. రోహిత్‌ తిరిగి కెప్టెన్‌గా వస్తే.. భవిష్యత్తు నాయకుడిని సిద్ధం చేసే బాధ్యత కూడా ముంబైపై ఉంటుంది. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్లను తదుపరి నాయకత్వ ప్రత్యామ్నాయాలుగా పరిశీలించే అవకాశం ఉంది. జట్టు వ్యూహాలు, భవిష్యత్తు ప్రణాళికల్లో రోహిత్‌ మరింత కీలక పాత్ర పోషిస్తాడనే ఊహాగానాలూ ఉన్నాయి. అయితే వీటిపై ఫ్రాంచైజీ ఎలాంటి ప్రకటన చేయలేదు.


ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 13 , 2026 | 08:35 PM