స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్ చిట్!
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:55 PM
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఊరట లభించింది. ఈ విషయమై ఐసీసీ ఎలాంటి చర్యలకూ ఉపక్రమించకూడదని నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటనకు సంబంధించిన డ్రెస్సింగ్‌రూమ్ వీడియో వ్యవహారంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB)పై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) తెలిపింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన అనంతరం తదుపరి చర్యలేవీ అవసరంలేదని నిర్ణయిస్తూ స్పష్టతనిచ్చింది.
ఇదీ జరిగింది..
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డ్రెస్సింగ్‌రూమ్‌లో సహచర ఆటాగాళ్ల మధ్య ప్రకటించాడు. ఈ దృశ్యాలను మ్యాచ్ నాలుగో రోజు ఆట కొనసాగుతుండగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈసీబీ. ఆ సమయంలో స్టోక్స్ ఇంకా మ్యాచ్ ఆడుతూ ఉండటంతో ఈ వీడియోపై వివాదం చెలరేగింది. మ్యాచ్ పూర్తికాకముందే ఇలాంటి సన్నివేశాలను బహిర్గతం చేయడంపై ఈసీబీని ఐసీసీ వివరణ కోరింది. విచారణ అనంతరం ఈసీబీపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఐసీసీ నిర్ణయించింది. అయితే.. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా(PMOA)లోని ఆర్టికల్ 2.2.11 నిబంధనల ప్రకారం.. ప్రసార ప్రయోజనాల పేరిట డ్రెస్సింగ్‌రూమ్‌లో ఎలాంటి వీడియో కెమెరాలు, ఇతర రికార్డింగ్ టూల్స్‌ను అమర్చకూడదని స్పష్టం చేసింది.
కాగా.. ఈసీబీ నుంచి ఐసీసీ వివరణ కోరినట్టు వార్తలు వెలువడిన సమయంలో బెన్ స్టోక్స్ 'Sack him...' అని సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా స్పందించడం చర్చనీయాంశమైంది. మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు సహచర ఆటగాళ్లతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆఖరి వరకు పూర్తి అంకితభావంతో ఆడాలని వారికి సూచించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో ఓ వికెట్ కూడా సాధించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది.
ఇవీ చదవండి:
వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన జకోవిచ్
ఒకే ఫ్రేమ్‌లో సచిన్, కోహ్లీ, గిల్.. వింబుల్డన్ పోస్ట్ వైరల్!