వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన జకోవిచ్
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:31 AM
జకోవిచ్ రిటైర్‌మెంట్ వార్తలు నెట్టింట జోరందుకున్నాయి. వచ్చే ఏడాది వింబుల్డన్ టోర్నీ ప్రారంభయ్యే సమయానికి అతడికి 40 ఏళ్లు నిండనున్నాయి. అయితే ఈ క్రమంలో వస్తోన్న ఆ వార్తలన్నింటీకి జకోవిచ్ చెక్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: వింబుల్డన్ 2026లో సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న సెమీ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ సునాయసంగా గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అజేయంగా నిలిచిన జకోవిచ్.. ఆఖరి మెట్టు బోల్తా పడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ క్రమంలో జకోవిచ్ రిటైర్‌మెంట్ వార్తలు నెట్టింట జోరందుకున్నాయి. వచ్చే ఏడాది వింబుల్డన్ టోర్నీ ప్రారంభయ్యే సమయానికి అతడికి 40 ఏళ్లు నిండనున్నాయి. అయితే ఆ వార్తలన్నింటీకి జకోవిచ్ చెక్ పెట్టాడు. వచ్చే ఏడాది కూడా బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు.
‘నా ప్రయాణం అప్పుడే అయిపోలేదు. కనీసం మరోసారి అయినా వింబుల్డన్‌లో ఆడతా. మూడు రోజుల క్రితం క్వార్టర్ ఫైనల్లో సాధించిన విజయం పట్ల గర్వంగా ఉంది. ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో ఆడగలనని నాకు నేనే నిరూపించుకున్నాను. ప్రపంచ నంబర్ 1 చేతిలో నేరుగా మూడు సెట్లలో ఓడిపోవడం వాస్తవం. దాన్ని అంగీకరించాల్సిందే. అయినప్పటికీ ఈ టోర్నీలో నా పోరాట పటిమ, అంకితభావం సానుకూల అంశాలే. 99 శాతం మంది ఆటగాళ్లకు సెమీఫైనల్ చేరడం గొప్ప ఫలితమే. కానీ నాకు మాత్రం అది సరిపోదు. రెండు దశాబ్దాలకు పైగా అత్యున్నత విజయాలకు అలవాటుపడ్డాను. అందుకే ఎప్పుడూ మరింత పెద్ద లక్ష్యాలే కనిపిస్తుంటాయి. ఆ అంచనాలు, వాస్తవాల మధ్య సమతుల్యత సాధించేందుకు ప్రయత్నిస్తున్నా’ అని జకోవిచ్ పేర్కొన్నాడు.
2022 తర్వాత జకోవిచ్ ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ కూడా గెలవలేదు. 2023 యూఎస్ ఓపెన్ తర్వాత అతడి ఖాతాలో మరో మేజర్ ట్రోఫీ చేరలేదు. గతేడాది నాలుగు గ్రాండ్ స్లామ్‌ల్లోనూ సెమీ ఫైనల్ దశలోనే నిష్క్రమించిన అతడు.. 2024 వింబుల్డన్ ఫైనల్‌తో పాటు ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో మహిళల దిగ్గజం మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డును అధిగమించే అవకాశం మరోసారి వాయిదా పడింది. వింబుల్డన్ ప్రయాణం ముగియడంతో జకోవిచ్ ఇప్పుడు అమెరికా హార్డ్‌కోర్ట్ సీజన్‌పై దృష్టి సారించాడు. నాలుగు సార్లు యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అయిన అతడు.. ఈసారి మరోసారి టైటిల్ వేటలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీతో గంభీర్ సుదీర్ఘ చర్చ.. వీడియో వైరల్!
ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీస్‌కి దూసుకెళ్లిన స్పెయిన్