ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీస్‌కి దూసుకెళ్లిన స్పెయిన్
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:36 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో బెల్జియం కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో స్పెయిన్ సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో బెల్జియం కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో స్పెయిన్ సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. చివరి నిమిషాల్లో ప్రత్యర్థి గోల్ కీపర్ సెన్నే లామెన్స్ చేసిన తప్పిదాన్ని మికెల్ మెరినో సద్వినియోగం చేసుకోవడంతో స్పెయిన్ విజయాన్ని అందుకుంది. సెమీస్‌లో ఫ్రాన్స్ జట్టుతో తలపడనుంది.
మ్యాచ్ 30వ నిమిషంలో ఫాబియన్ రుయిజ్ గోల్‌తో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 41వ నిమిషంలో చార్లెస్ డి కెటెలారే గోల్ చేసి బెల్జియం స్కోరును సమం చేశాడు. ఈ టోర్నీలో స్పెయిన్‌పై నమోదైన తొలి గోల్ ఇదే కావడం విశేషం. మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లేలా కనిపించిన 88వ నిమిషంలో పౌ కుబార్సీ దూరం నుంచి కొట్టిన షాట్‌ను బెల్జియం గోల్ కీపర్ లామెన్స్ సరిగా అడ్డుకోలేకపోయాడు. రీబౌండ్‌గా వచ్చిన బంతిని మెరినో నెట్‌లోకి పంపి స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు. పోర్చుగల్‌పై ప్రిక్వార్టర్స్‌లోనూ చివరి నిమిషంలోనే విజయం అందించిన మెరినో మరోసారి హీరోగా నిలిచాడు.
బెల్జియం తొలి ఎంపిక గోల్ కీపర్ థిబో కోర్టువా రెండో అర్థంలో గాయపడటంతో లామెన్స్ బరిలోకి దిగాడు. మ్యాచ్ అనంతరం నిరాశలో ఉన్న అతడిని కోర్టువా ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పెయిన్ తరఫున యువ సంచలనం లామిన్ యమాల్ అద్భుత ప్రదర్శన కనబరిచి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత
భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు