Share News

లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత

ABN , Publish Date - Jul 10 , 2026 | 06:02 PM

భారత మహిళా జట్టు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ ఏకైక టెస్టులో.. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.

లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత
Smriti Mandhana

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా జట్టు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ ఏకైక టెస్టులో.. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ కెరీర్‌లో అతి పిన్న వయసులో 300 మ్యాచ్‌లు ఆడిన బ్యాటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత మహిళల జాబితాలో స్మృ‌తి మూడో స్థానంలో ఉంది.


2013లో బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన స్మృతి.. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 300 మ్యాచ్‌లు ఆడింది. ఈ జాబితాలో ప్రస్తుతం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(374) అగ్రస్థానంలో ఉండగా, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(333) రెండో స్థానంలో కొనసాగుతోంది. 29ఏళ్ల స్మృతి ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు, 120 వన్డేలు, 171 టీ20 మ్యాచులు ఆడింది. మొత్తం 10వేలకుపైగా పరుగులు చేసింది. ఇందులో 17 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


లార్డ్స్‌లో తొలి హాఫ్ సెంచరీ..

లార్డ్స్ మైదానంలో భారత మహిళలకు ఇది తొలి టెస్టు కావడం విశేషం. అయితే ఈ మైదానంలో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా స్మృతి చరిత్ర సృష్టించింది. 67 బంతుల్లో 56 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(0), యాస్తికా భాటియా(12) నిరాశ పర్చారు. జెమీమా రోడ్రిగ్స్(35) పరుగులు చేసి ఔటైంది. కాగా స్మృతి మంధాన(56*), హర్మన్ ప్రీత్ కౌర్(14*) క్రీజులో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, లారెన్ ఫైలర్, ఇస్సీ వాంగ్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్

Updated Date - Jul 10 , 2026 | 06:02 PM