Share News

భారీ షాట్లకు ప్రయత్నించకండి.. వైభవ్, అభిషేక్ శర్మలకు బీసీసీఐ కీలక సూచనలు!

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:19 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ ఉండగానే భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్లేయర్ల ప్రదర్శనపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

భారీ షాట్లకు ప్రయత్నించకండి.. వైభవ్, అభిషేక్ శర్మలకు బీసీసీఐ కీలక సూచనలు!
BCCI

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ ఉండగానే భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. నాలుగో టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో భారత ప్లేయర్ల ప్రదర్శనపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిక్సర్లపై అతిగా ఆధారపడే ధోరణిని నియంత్రించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఈ విషయంపై మాట్లాడారు. ‘అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు బాదే సామర్థ్యం అద్భుతం. కానీ ప్రతి బంతిని బౌండరీ దాటించాలనే ఆలోచనకు నియంత్రణ అవసరం. పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్‌ను నిర్మించుకోవడం కూడా నేర్చుకోవాలి’ అని పేర్కొన్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి మాత్రం ఆరంభం ఆశించినంతగా లేదు. అతడు ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచాడు.


మరోవైపు అభిషేక్ శర్మ ప్రదర్శన వైభవ్‌తో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ నిలకడ లోపించింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 49, 0 పరుగులు చేసిన అతడు.. ఇంగ్లండ్ సిరీస్‌లో 59, 43, 10, 16 పరుగులు నమోదు చేశాడు. జట్టులో మెరుగ్గా రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడిగా నిలిచినా, మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలిచే స్థాయి ప్రభావం మాత్రం ఇప్పటివరకు చూపలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో యువ ఓపెనర్లు దూకుడు కొనసాగిస్తూనే పరిస్థితులకు అనుగుణంగా బాధ్యతాయుతమైన బ్యాటింగ్ కూడా అలవర్చుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్

Updated Date - Jul 10 , 2026 | 05:28 PM