విదేశాల్లో భారత్ విఫలం.. ఈ నిజాన్ని అంగీకరించాల్సిందే: సహాయ కోచ్ ర్యాన్ టెన్
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:08 PM
నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పిచ్‌లపై భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోందని.. ఈ వాస్తవాన్ని అంగీకరించాలని స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత భారత జట్టు ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. ఐర్లాండ్‌తో క్లీన్ స్వీప్ అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన భారత టీ20 జట్టుకు ఇక్కడ కూడా షాక్ తగిలింది. ఐదు టీ20ల సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత టీమిండియా వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పిచ్‌లపై భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోందని.. ఈ వాస్తవాన్ని అంగీకరించాలని స్పష్టం చేశాడు. విదేశాల్లో విఫలమనే ముద్రను తొలగించుకోవాల్సిన అవసరం భారత ప్లేయర్లపై ఉందని తెలిపాడు.
‘పిచ్ అనుకూలిస్తేనే విజయం సాధిస్తామని చెప్పడం సులభమే. కానీ దానికి అనుగుణంగా పిచ్‌ను అర్థం చేసుకుని ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలి. ప్రస్తుతం మా జట్టుకు అదే అతిపెద్ద సవాలు. ముందుగా విదేశీ పరిస్థితుల్లో మేం ఆశించిన స్థాయిలో ఆడటం లేదనే విషయాన్ని అంగీకరించాలి. ఈడెన్ గార్డెన్స్‌లో భారీ సిక్సర్లు బాది.. 250కి పైగా పరుగులు చేయడం ఒక ఎత్తు. మాంచెస్టర్, ఆస్ట్రేలియాలోని ఎంసీజీ వంటి వేదికల్లో రాణించడం మరో ఎత్తు. అన్ని పరిస్థితుల్లో విజయాలు సాధించే జట్టుగా మారాలంటే ప్లేయర్లకు మానసికంగా కూడా మార్పు రావాలి’ అని పేర్కొన్నాడు.
మా ప్రదర్శన నిరాశపర్చింది..
‘జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్‌లో పనిచేసిన విధానం ఇక్కడ పని చేయదని మాకు తెలుసు. అయినా ఆ ఆలోచనా విధానం నుంచి బయటకు రావడంలో విఫలమయ్యాం. ఈ పిచ్‌లపై చిన్నచిన్న మార్పులు చేస్తే సరిపోయేది. కానీ వాటిని అమలు చేయలేకపోయాం. అందుకే మా ప్రదర్శన నిరాశపరిచింది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో లేని శ్రేయస్ ఇప్పుడు భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మిగిలిన ఆటగాళ్లంతా నాలుగు నెలల క్రితమే ప్రపంచ కప్ గెలిచిన వారు. ఈ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకోవాలి. అయితే ప్రపంచ కప్, ఐపీఎల్, అఫ్గానిస్థాన్ సిరీస్ తర్వాత కేవలం నాలుగు లేదా ఐదు రోజుల ప్రాక్టీస్‌తో ఇక్కడికి రావడం ఆమోదయోగ్యం కాదు. విదేశీ పరిస్థితులకు ప్రత్యేకంగా సన్నద్ధం కావడం ఎంత ముఖ్యమో ఈ పర్యటన మాకు మరోసారి గుర్తు చేసింది" అని ర్యాన్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు
వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్