ఆస్ట్రేలియా గడ్డపై ‘ఐపీఎల్’ ధమాకా.. బీసీసీఐకి బంపర్ ఆఫర్!
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:42 PM
భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ బంధం సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ టీ20 టోర్నీ 'బిగ్‌బాష్ లీగ్' చరిత్రలోనే మొదటిసారిగా ఆ దేశం వెలుపల నిర్వహించనున్నారు. అదే విధంగా ఐపీఎల్ కూడా...
స్పోర్ట్స్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ బంధం సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ టీ20 టోర్నీ 'బిగ్‌బాష్ లీగ్' (BBL) చరిత్రలోనే మొదటిసారిగా ఆ దేశం వెలుపల నిర్వహించనున్నారు. భారత్‌లోని ప్రసిద్ధ చెన్నై చెపాక్ మైదానంలో డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ నిర్వహించనున్నారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ (MCG) వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ సంయుక్తంగా ఈ చరిత్రాత్మక ప్రకటన చేశారు.
రెండు దేశాల మధ్య దౌత్య, క్రీడా సంబంధాలను బలోపేతం చేసే 'G’day Namaste' ఉత్సవాల్లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మైత్రి కేవలం బిగ్‌బాష్ లీగ్‌కే పరిమితం కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న లీగైన ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా ఆస్ట్రేలియాలో నిర్వహించేలా 'క్రికెట్ ఆస్ట్రేలియా' (CA) ప్రణాళికలు రచిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ జాతీయ మీడియ నివేదిక ప్రకారం.. చెన్నైలో బిగ్‌బాష్ మ్యాచ్‌ను ఏటా నిర్వహించేలా ఒప్పందం చేసుకోనుంది.
దీనికి బదులుగా ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐకి క్రికెట్ ఆస్ట్రేలియా బహిరంగ ఆహ్వానం పంపింది. ప్రస్తుతం ఇరు దేశాల బోర్డుల మధ్య దీనిపై ప్రైవేట్ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ బీసీసీఐ గనుక ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, భవిష్యత్తులో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లేదా సిడ్నీ మైదానాల్లో ఐపీఎల్ సిక్సర్ల మోతను, అక్కడ ఉండే భారత అభిమానులు ప్రత్యక్షంగా చూడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
టీమిండియా ఓటములపై బీసీసీఐ సీరియస్.. గంభీర్, శ్రేయస్ పదవులపై సమీక్ష!
ఆసీస్ ‘బిగ్‌బాష్’కు చేపాక్ వేదిక.. కొత్త చరిత్రకు సిద్ధమైన చెన్నై..