Share News

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చేపాక్ వేదిక.. కొత్త చరిత్రకు సిద్ధమైన చెన్నై..

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:29 PM

ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్‌ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చేపాక్ వేదిక.. కొత్త చరిత్రకు సిద్ధమైన చెన్నై..
Big Bash League 2026-27

స్పోర్ట్స్ డెస్క్: భారత్‌లో ఐపీఎల్ తరహాలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు వివిధ లీగ్‌లను నిర్వహిస్తూన్నాయి. అలాంటి వాటిల్లో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ ఒకటి. దేశ, విదేశీ క్రికెటర్లు ఆడే ఈ లీగ్‌.. 2011లో ప్రారంభమైంది. బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా వెలుపల మ్యాచ్‌లు జరగలేదు. మొట్టమొదటి సారి ఆసీస్ బయట బీబీఎల్ మ్యాచ్ జరగనుంది. అది కూడా భారత్ గడ్డపై జరగనుండటం విశేషం. ఈ సరికొత్త చరిత్రకు చెన్నైలోని చేపాక్ వేదిక కానుంది.


బీబీఎల్ 2026-27 సీజన్‌ తొలి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 12న పెర్త్ స్కార్చర్స్‌ - మెల్‌బోర్న్‌ రెనెగెడ్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్‌ జరగనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi In Australia) అధికారికంగా ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో కలిసి మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ను మోదీ సందర్శించారు. భారత్, ఆస్ర్టేలియా మధ్య క్రీడల్లో సహకారం కోసం ఎంసీజీ మైదానంలో రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు. టీ20 ప్రపంచ కప్‌2026 విజేతగా నిలిచిన ఆసీస్ మహిళా జట్టును ప్రధాని మోదీ అభినందించారు.


ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. ‘బిగ్‌బాష్ లీగ్‌ మ్యాచ్‌ను చెన్నైలో నిర్వహించేందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నా. భారత్‌ వేదికగా ఎలాంటి లీగ్‌ అయినా సరే అభిమానులు ఆదరిస్తారు. వీక్షకుల సంఖ్య కూడా అద్భుతంగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. క్రీడల్లోనే కాకుండా భారత్ - ఆస్ట్రేలియా భాగస్వామ్యం ఇతర విభాగాల్లోనూ ఛాంపియన్‌గా నిలుస్తుందన్న నాకు నమ్మకం ఉంది. 2030 కామన్వెల్త్‌ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాము' అని ప్రధాని మోదీ వెల్లడించారు.


‘ఎంసీజీలో అడుగు పెట్టే ఏ భారతీయుడికైనా ఒకేసారి రెండు రకాల భావోద్వేగాలు కలుగుతాయి. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లో ఉండే ఉత్కంఠ. రెండోది.. ఇరు దేశాల్లో క్రికెట్ అంటే కేవలం క్రీడ మాత్రమే కాదు.. ఉమ్మడి అభిరుచి అని గ్రహించాలి. ఇవాళ మాత్రం ఎలాంటి చివరి ఓవర్‌ ఫినిషింగ్‌ ఒత్తిడి లేదు. దానికి బదులుగా క్రీడను ఆస్వాదించడం, స్నేహాన్ని గుర్తు చేసుకోవడం, భవిష్యత్తు ఛాంపియన్లలో ఉత్తేజాన్ని అందించడం చేద్దాం. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల స్పోర్ట్స్‌ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’ అని మోదీ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

క్యాచ్ పూర్తికాకముందే క్రీజు నుంచి వెళ్లిపోయిన వైభవ్.. వీడియో వైరల్

మరోసారి నిరాశే ఎదురైంది.. ఓటమిపై స్పందించిన శ్రేయస్

Updated Date - Jul 10 , 2026 | 12:33 PM