క్యాచ్ పూర్తికాకముందే క్రీజు నుంచి వెళ్లిపోయిన వైభవ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:33 AM
ఇంగ్లండ్ గడ్డపై మరోసారి భారత ఆటగాళ్లు తేలిపోయారు. నిన్న జరిగిన నాల్గో టీ20లో ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లో విఫలమై సిరీస్‌ను కోల్పోయారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అభిమానులను మరోసారి నిరాశకు గురిచేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ గడ్డపై మరోసారి భారత ఆటగాళ్లు తేలిపోయారు. నిన్న జరిగిన నాల్గో టీ20లో ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లో విఫలమై సిరీస్‌ను కోల్పోయారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అభిమానులను మరోసారి నిరాశకు గురి చేశాడు. ఈ సారి కూడా కేవలం 15 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. రెండో ఓవర్లోనే వరుస ఫోర్, సిక్సర్ కొట్టి మంచి ఫామ్ అందుకున్న వైభవ్.. ఆ తర్వాతి ఓవర్లో మరో భారీ సిక్సర్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ క్రమంలో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. క్యాచ్ పూర్తి కాకముందే.. క్రీజును వదిలి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింల్లో వైరల్ అవుతోంది.
టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచులకు వైభవ్‌ను ఆడించకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కావాలనే వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరుసగా విఫలమవుతున్న వరల్డ్ కప్ 2026 విన్నర్ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టి మరీ.. వైభవ్‌కు తుది జట్టులో అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20తో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
తన తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం14 పరుగులే చేశాడు. మూడో టీ20లో 13 పరుగులు చేయగా.. నాల్గో మ్యాచులో కూడా ఇదే తరహా పరుగులు చేశాడు. 15 పరుగులు చేసి.. ఆర్చర్ బౌలింగ్‌లో సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్.. ఆది నుంచి దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. జోష్ టంగ్ వేసిన రెండో ఓవర్లో వైభవ్ చెలరేగి ఆడాడు. అతడి ఓవర్లో వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
ఈసారైన మంచి ఇన్నింగ్స్ ఆడాలని భావించిన వైభవ్ కు మరోసారి నిరాశే ఎదురైంది. మూడో ఓవర్ నాల్గో బంతికి బలంగా బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని వైభవ్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ఫలితంగా సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే , సామ్ కరన్ క్యాచ్ పట్టడం పూర్తి కాకముందే.. తీవ్ర నిరాశతో వైభవ్ పెవిలియన్ వైపు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తదుపరి మ్యాచ్‌లో కూడా ఇలానే విఫలమైతే.. వైభవ్‌పై ఒత్తిడి పెరుగుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
మరోసారి నిరాశే ఎదురైంది.. ఓటమిపై స్పందించిన శ్రేయస్
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ షాక్.. ఎంబాపెకు గాయం