Share News

ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ షాక్.. ఎంబాపెకు గాయం

ABN , Publish Date - Jul 10 , 2026 | 09:49 AM

ఫిఫా ప్రపంచకప్2026లో ఫ్రాన్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే, ఈ అద్భుత విజయానందంలో ఉన్న ఫ్రాన్స్ అభిమానులను కెప్టెన్ క్లియాన్ ఎంబాపె గాయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ షాక్.. ఎంబాపెకు గాయం
Kylian Mbappe injury

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్2026లో ఫ్రాన్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఫ్రాన్స్ 2-0 తేడాతో మొరాకోపై ఘనవిజయం సాధించింది. అయితే, ఈ అద్భుత విజయానందంలో ఉన్న ఫ్రాన్స్ అభిమానులను కెప్టెన్ క్లియాన్ ఎంబాపె గాయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మ్యాచ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు ఈ 27 ఏళ్ల స్టార్ స్ట్రైకర్ చీలమండ నొప్పితో మైదానాన్ని వీడాడు.


బోస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో మొరాకో డిఫెండర్స్ ఫ్రాన్స్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నారు. మొదటి హాఫ్‌లో లభించిన పెనాల్టీని ఎంబాపే చేజార్చడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే సెకండ్ హాఫ్‌లో ఫ్రాన్స్ వ్యూహాన్ని మార్చి ఎదురుదాడికి దిగింది. మ్యాచ్ 60వ నిమిషంలో ఎంబాపె అద్భుతమైన కర్లింగ్ షాట్‌తో మొరాకో గోల్ కీపర్ బోనోను బోల్తాకొట్టించి తొలి గోల్ సాధించాడు. ఆ తర్వాత కేవలం ఆరు నిమిషాలకే (66వ నిమిషం) ఎంబాపె అందించిన అద్భుతమైన పాస్‌ను పిఎస్‌జి స్టార్ ఉస్మానే డెంబెలె గోల్‌గా మలిచి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.


ఆట మధ్యలోనే చీలమండ నొప్పితో బాధపడిన ఎంబాపె.. మొదట అలాగే కొనసాగినప్పటికీ, 77వ నిమిషంలో నొప్పి ఎక్కువ కావడంతో మైదానంలోనే కూలబడ్డాడు. దీంతో కోచ్ డిడియర్ డెషాంప్స్ అతడి స్థానంలో జీన్ ఫిలిప్ మాటెటాను ఆడించాడు. ఎంబాపె గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రానప్పటికీ మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు గ్యాలరీలోని అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించాడు. దీంతో అతడికి అయిన గాయం అంత పెద్దది కాకపోవచ్చని తెలుస్తోంది. సెమీస్ ముంగిట తన గాయంపై అభిమానులకు ఎంబాపె సానుకూల అప్‌డేట్ ఇచ్చాడు. 'నేను బాగానే ఉన్నాను. నా చీలమండకు దెబ్బ తగిలింది. కానీ అంతా బాగానే ఉంది' అని ఎంబాపె వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీఫైనల్స్‌‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్‌

అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్

Updated Date - Jul 10 , 2026 | 09:53 AM