మరోసారి నిరాశే ఎదురైంది.. ఓటమిపై స్పందించిన శ్రేయస్
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:41 AM
ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టీ20లోనూ భారత జట్టు ఓడింది. దీనిపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. పరివర్తన దశలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతుంటాయని, వాటి నుంచి త్వరగా పాఠాలు నేర్చుకోవాలని తెలిపాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టీ20లోనూ భారత జట్టు ఓడింది. ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో పాటు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్అనంతరం ఓటమిపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పరివర్తన దశలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతుంటాయని, వాటి నుంచి త్వరగా పాఠాలు నేర్చుకోవాలని పేర్కొన్నాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటమితో మరోసారి మాకు నిరాశే మిగిలింది. ఈ పిచ్‌పై 158 పరుగుల లక్ష్యమంటే విజయానికి ఏమాత్రం సరిపోదు. అందుకు తగ్గట్లుగానే ఇంగ్లండ్ వేగంగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది. లెంగ్త్ బౌలింగ్‌ను పదేపదే విసిరితేనే గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం. పేస్‌లో మార్పులు చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు సులభంగా బౌండరీలు కొట్టేశారు' అని అయ్యర్ వెల్లడించాడు.
ఇదే సమయంలో తన వ్యక్తిగత ప్రదర్శనపై కూడా శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ' నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల మాత్రం నేను సంతోషంగానే ఉన్నాను. జట్టు ఓడినప్పుడు మంచి ఇన్నింగ్స్‌కు విలువ ఉండదు. నిజానికి నేను బాగా ఆడిన దాదాపు ప్రతిసారీ జట్టు గెలిచేది. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అలా జరగలేదు. తదుపరి మ్యాచ్‌కు తప్పులను సరిచేసుకుని అనుకున్న ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తాము. యువ క్రికెటర్లలో చాలా మంది తొలిసారి ఇలాంటి పిచ్‌లపై ఆడుతున్నారు. కాబట్టి తప్పులు సహజమే. అయితే, వీటి నుంచి ఎంత త్వరగా పాఠాలు నేర్చుకుంటామనేదే ముఖ్యం' అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
నిన్న జరిగిన నాల్గో టీ20లో శ్రేయస్ అయ్యర్ మెరిశాడు. అతడు 49 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో శివం దూబే (22) మాత్రమే ఇరవై పరుగులు దాటాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది.
ఇవి కూడా చదవండి:
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ షాక్.. ఎంబాపెకు గాయం
ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్