Share News

ఐపీఎల్ 2027.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా చమిందా వాస్‌

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:52 AM

ఐపీఎల్‌ 2027కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. శ్రీలంక దిగ్గజ పేసర్ చమిందా వాస్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది.

ఐపీఎల్ 2027.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా చమిందా వాస్‌

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2027కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ తన కోచింగ్‌ బృందాన్ని బలోపేతం చేసుకుంటోంది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ల తర్వాత.. తాజాగా శ్రీలంక దిగ్గజ పేసర్‌ చమిందా వాస్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని డీసీ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.


లంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష సేవలందించిన వాస్‌.. టెస్టుల్లో 111 మ్యాచ్‌లు ఆడి 355 వికెట్లు, వన్డేల్లో 322 మ్యాచ్‌ల్లో 400 వికెట్లు పడగొట్టాడు. 1996లో ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోనూ అతడ సభ్యుడిగా ఉన్నాడు. ఎడమచేతి వాటం పేసర్‌ అయిన వాస్‌.. కొత్త బంతితో స్వింగ్‌ రాబట్టడం సహా కచ్చితమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో దిట్ట. ఆటగాడిగానే కాకుండా కోచ్‌గానూ వాస్‌కు మంచి అనుభవం ఉంది. శ్రీలంక జాతీయ జట్టుతో పాటు యువ క్రీడాకారులకు కూడా సేవలందించాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఐర్లాండ్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా సేవలందించిన వాస్.. న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు కన్సల్టెంట్‌గానూ వ్యవహరించాడు.


కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్ కోచ్‌గా ఈ నెల 6న సౌరభ్‌ గంగూలీని నియమించింది యాజమాన్యం. 2019 నుంచి ఆ ఫ్రాంచైజీతో అనుబంధం ఉన్న గంగూలీకి ఐపీఎల్‌లో మెయిన్ కోచ్‌గా వ్యవహరించడమిదే తొలిసారి. ఆ తర్వాత అక్టోబర్ 13న యువరాజ్‌ సింగ్‌ను అసిస్టెంట్, బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసింది. అటు అధికారిక కోచ్‌గా యువరాజ్‌ బాధ్యతలు చేపట్టడం కూడా ఇదే మొదటిసారి.


గత రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది డీసీ. 2025లో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోగా, 2026లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో కోచింగ్‌ విభాగంలో మార్పులు చేపట్టింది. గంగూలీ నాయకత్వం, యువరాజ్‌ బ్యాటింగ్‌ అనుభవం, వాస్‌ బౌలింగ్‌ నైపుణ్యంతో వచ్చే సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఢిల్లీ. ఇప్పటివరకు ఐపీఎల్‌ టైటిల్‌ గెలవని ఆ జట్టు.. ఈసారైనా ఆ నిరీక్షణకు తెరదించాలని ఎదురుచూస్తోంది.


ఇవీ చదవండి:

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

‘నా కూతురిని నేనే చంపేశా’.. 911కు తల్లి ఫోన్‌ కాల్

Updated Date - Oct 17 , 2026 | 11:52 AM