Share News

‘బౌలర్లనూ పట్టించుకోండి’.. బీసీసీఐకి మాజీ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ విజ్ఞప్తి

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:19 PM

టీ20 క్రికెట్‌లో భారీ స్కోర్లు, బౌలర్లపై పెరుగుతున్న ఒత్తిడిపై మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందించాడు. బ్యాట్, బంతి మధ్య సమతూకం ఉండేలా అంతర్జాతీయ మ్యాచ్‌ల పిచ్‌లను రూపొందించాలని బీసీసీఐకి సూచించాడు.

‘బౌలర్లనూ పట్టించుకోండి’.. బీసీసీఐకి మాజీ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ విజ్ఞప్తి
BCCI Sent Urgent Plea By Ex-Chief Selector Chatna Sharma

ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల విధ్వంసం పెరిగిపోతోంది. బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ భారీ స్కోర్లు ఈజీగా భారీ స్కోర్లు సాధిస్తున్నారు. అటు బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటూ చెత్త గణాంకాలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బీసీసీఐకి కీలక విజ్ఞప్తి చేశాడు. పిచ్‌ల రూపకల్పనలో బౌలర్లకూ ప్రాధాన్యమివ్వాలని సూచించాడు. బ్యాట్, బంతి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతాయని చెప్పుకొచ్చాడు.


భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో బ్యాటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని చేతన్‌ శర్మ అన్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు 200కు పైగా స్కోర్లు నమోదవడం.. బౌలర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తోందని పేర్కొ్న్నాడు. రెండో టీ20లో భారత్‌ 249 పరుగులు చేసినప్పటికీ.. విండీస్ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించడం దీనికి ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నాడు. ఫోర్లు, సిక్సర్లు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారన్నది నిజమేనని, అయితే బౌలర్ల కష్టాలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. దేశవాళీ క్రికెట్లో బౌలర్లకు సహకరించే పిచ్‌లు రూపొందిస్తున్నట్లే.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ సమతూకంతో కూడిన వికెట్లను సిద్ధం చేయాలన్నాడు. మ్యాచ్‌ ఏకపక్షంగా సాగకుండా బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలు లభించాలని అభిప్రాయపడ్డాడు.


రో-కోల ప్రదర్శనపై స్పందిస్తూ..

మరోవైపు 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల భాగస్వామ్యంపై జరుగుతున్న చర్చలపైనా స్పందించాడు చేతన్‌ శర్మ. ఆటగాళ్ల వయసు కంటే వారి ప్రదర్శనకే ప్రాధాన్యమివ్వాలని సూచించాడు. జట్టు కోసం పరుగులు సాధిస్తూ, విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నంతకాలం వారి భవిష్యత్తుపై చర్చలకు తావివ్వాల్సిన అవసరం లేదన్నాడు. విండీస్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌, కోహ్లీ శతకాలు సాధించిన విషయాన్నీ ప్రస్తావించిన అతడు.. దేశం తరఫున ఆడుతూ రాణించడం, జట్టుకు విజయాలు అందించడమే ముఖ్యమని పేర్కొన్నాడు.


ఇవీ చదవండి:

వర్చువల్‌ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్‌

గుజరాతీ గర్బాకు స్విస్‌ అంబాసిడర్‌ మాయా టిస్సాఫి ఫిదా.!

Updated Date - Oct 16 , 2026 | 12:30 PM