Share News

గుజరాతీ గర్బాకు స్విస్‌ అంబాసిడర్‌ మాయా టిస్సాఫి ఫిదా.!

ABN , Publish Date - Oct 15 , 2026 | 10:33 AM

గుజరాత్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మరోసారి ఆకట్టుకున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ వేడుకల్లో.. స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిస్సాఫి సంప్రదాయ లెహంగా చోళీ ధరించి గర్బా నృత్యంతో అలరించారు.

గుజరాతీ గర్బాకు స్విస్‌ అంబాసిడర్‌ మాయా టిస్సాఫి ఫిదా.!
Swiss ambassador Maya Tissafi joins Gujarat's Navratri festivities

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మరోసారి ఆకట్టుకున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పే గుజరాతీ గర్బా వేడుకల్లో స్విట్జర్లాండ్‌ రాయబారి మాయా టిస్సాఫి సందడి చేశారు. సంప్రదాయ లెహంగా చోళీ ధరించి గర్బా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారామె. బీజేపీ ఎంపీ డా.హేమంగ్ జోషి నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 వేల మంది హాజరవడంతో అంగరంగ వైభవంగా సాగింది.


కలర్‌ఫుల్ లెహంగా చోళీలో గర్బా నృత్యం చేస్తున్న టిస్సాఫి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ, స్థానిక సంస్కృతిలో భాగస్వామై పూజా కార్యక్రమాలకు హాజరైన ఆమె.. నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షించారు. ఈ నేపథ్యంలో ఆమెపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇలాంటి కార్యక్రమాలు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు.


కార్యక్రమం అనంతరం టిస్సాఫి మాట్లాడుతూ.. 'నవరాత్రి వేడుకల్లో పాల్గొనడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఈ సాయంత్రాన్ని స్ఫూర్తిదాయకమైన అనుభవంగా భావిస్తున్నా. గుజరాత్‌ సంప్రదాయ జానపద నృత్యమైన గర్బా.. భక్తి, సంస్కృతి, సమాజ ఐక్యతను ఒక తాటిపై నిలుపుతుంది. సుమారు 50 వేల మంది ఓ చోటకు చేరి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందానికి, ఐక్యతకు నిదర్శనం' అని ఎక్స్‌ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. నవరాత్రి వేడుకలు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయన్న ఆమె.. ఈ సంప్రదాయం తరతరాల ప్రజలను, దేశాల మధ్య సంబంధాలను అనుసంధానం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.


గుజరాత్‌లో నవరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించే గర్బా, దాండియా రాస్‌ నృత్యాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ ఉత్సవాల్లో మహిళలు, పురుషులు సంప్రదాయ వస్త్రధారణతో రౌండ్‌గా నిల్చుని డ్యాన్స్ చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తారు. సంగీతం, నృత్యం, భక్తితో సాగే ఈ ఉత్సవాలు ప్రజలను ఒక్కచోట చేర్చడమే కాకుండా.. సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.


ఇవీ చదవండి:

ముస్కాన్‌కు మరణశిక్ష.. పిల్లల భవితవ్యంపై సౌరభ్ కుటుంబం స్పందనిదే.?

నాల్గో టీ20లో టీమ్ఇండియా ఓటమికి ప్రధాన కారణం అతడే.!

Updated Date - Oct 15 , 2026 | 10:41 AM